Begin typing your search above and press return to search.

దూకుడుతో తెగే వరకు గులాబీ బాస్ లాగేశారా?

By:  Tupaki Desk   |   12 Nov 2021 4:30 PM GMT
దూకుడుతో తెగే వరకు గులాబీ బాస్ లాగేశారా?
X
పెళ్లికి చావుకు ఒకే మంత్రం ఎలా సూట్ కాదో.. అన్ని విషయాల్లోనూ దూకుడు ఏ మాత్రం మంచిది కాదు. తెలంగాణలో తనను టార్గెట్ చేస్తే.. దేశ వ్యాప్తంగా మూడో కూటమి దిశగా తాను ప్రయత్నాలు షురూ చేస్తానన్నట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారుతో ఫైటింగ్ కు దిగారనే చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి వేళ.. తనపై పెల్లుబుకుతున్న విమర్శలకు సమాధానం ఇచ్చే పేరుతో రెండు రోజుల పాటు వరుస పెట్టి ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపైనా ఘాటు విమర్శలు చేయటం తెలిసిందే.

తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు వీలుగా ఈ రోజున అధికారిక ధర్నాను ధర్నా చౌక్ లో నిర్వహించటమేకాదు..తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నిరసనలు.. ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించటం తెలిసిందే. ఇలా.. ఒకటి తర్వాత ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలు.. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారుకు సైతం ఆగ్రహాన్ని తెచ్చేలాఉందని చెబుతున్నారు.

ఇంతకాలం భవిష్యత్తు అవసరం కోసం కేసీఆర్ సర్కారుపై మోడీ ప్రభుత్వం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. తెలంగాణ అధికారపక్షంపై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో పోరాడుతున్నా.. కేంద్రంలోని మోడీ సర్కారు నుంచి అందుతున్న సహాయ సహకారాలు పెద్దగా లేవనే చెప్పాలి. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లను సాధించటంలో వెనుక బడుతుందని.. ఈ కారణంగానే తెలంగాణ అధికారపక్షంతో పాటు.. ఏపీలోని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితోనూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తారని చెబుతారు.

అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఈటల గెలుపు బీజేపీ అధినాయకత్వంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని చెబుతారు. అయితే.. అనూహ్యంగా కేసీఆర్ ఏర్పాటు చేసిన రెండు వరుస ప్రెస్ మీట్లు.. అందులో ప్రస్తావించిన అంశాలతో కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం భవిష్యత్తు అవసరాల కోసం తొందరపడకూడదన్న ఆలోచనలో ఉన్న కమలనాథలు.. ఇకపై అలా చేయూడదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఫ్యూచర్ లో ఏదో సాయంగా ఉంటారని.. ఇప్పుడు నష్టపోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. టీఆర్ఎస్ కేసీఆర్ ను ఇలానే వదిలేస్తే.. మరిన్ని సమస్యల్ని తీసుకొస్తారన్న ఆలోచనతోనే అలెర్టుగా ఉండాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇంతకాలం తన అవసరాన్ని గుర్తు చేస్తూ కాలం గడిపిన కేసీఆర్ కు తెలంగాణలో బలపడరని భావించిన కమలనాథులు.. ఇప్పుడు ఏకు కాస్తా మేకుగా మారుతున్నారన్న విషయాన్ని గుర్తించారు. అందుకే.. వారి బలాన్నిబలహీనంగా మార్చేందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలకు తెర తీసినట్లైంది. ఇప్పటికే కేసీఆర్ ప్రె్ మీట్ ను కిషన్ రెడ్డి ఖండించగా.. తాజాగా మరో కేంద్రమంత్రి షెకావత్ తన మాటలతో గులాబీ బాస్ గాలి తీసేశారు. తాజాగా తోమర్.. గోయల్ లు కూడా ప్రెస్ మీట్లు పెట్టి.. కేసీఆర్ పై ఆరోపణల కత్తి దూస్తారని చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పై పార్టీ జాతీయ నాయకత్వానికి బండి సంజయ్ నివేదిక ఇచ్చారని.. దీన్ని చూసిన అగ్ర నాయకత్వం విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు ఆచితూచి అడుగులు వేసిన కేసీఆర్.. తాజాగా మాత్రం తెగే వరకు విషయాన్ని లాగారన్నభావన వ్యక్తమవుతోంది.