Begin typing your search above and press return to search.

దేశానికి రాజ‌ధానిగా హైద‌రాబాద్‌..ఓకేః కేసీఆర్‌

By:  Tupaki Desk   |   18 Jan 2018 12:37 PM GMT
దేశానికి రాజ‌ధానిగా హైద‌రాబాద్‌..ఓకేః కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ మ‌రోమారు త‌నదైన రాజ‌కీయ చ‌మ‌త్కారాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఉద్య‌మం నుంచి మొద‌లుకొని రాజ‌కీయం దాకా...రాష్ట్రం నుంచి మొద‌లుకొని దేశానికి రెండో రాజ‌ధానిగా హైద‌రాబాద్‌ ను చేయ‌డం వ‌ర‌కూ కేసీఆర్ అనేక అంశాల‌ను పంచుకున్నారు. హైద‌రాబాద్‌ లోని పార్క్ హయత్‌ లో జరిగిన ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్ 2018 కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. తెలంగాణ‌ రాష్ట్ర ఏర్పాటు - అభివృద్ధి - హైదరాబాద్‌ పై ప్రముఖ జర్నలిస్టు రాజ్‌ దీప్ సర్దేశాయ్‌ తో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

మూడేళ్లలో తెలంగాణ అభివృద్ధిలో మార్పు ఎలా సాధ్యమైంది - విభజనకు ముందున్న అనుమానాలన్నీ ఎలా నివృత్తి చేయగలిగారని రాజ్‌ దీప్ ప్రశ్నించారు. ఆ ప్ర‌శ్న‌ల‌కు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. హింసకు తావులేకుండా రాష్ర్టాన్ని సాధించుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రక్తం చిందకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామ‌ని అదే రీతిలో తెలంగాణను పునర్‌ నిర్మిస్తూనే దేశాభివృద్ధిలో భాగమయ్యామని ఆయ‌న తెలిపారు. ఆర్థికాభివృద్ధి రేటులో ఇదే ఒరవడిని కొనసాగిస్తామ‌న్నారు. సంస్కృతి - సంప్రదాయాల విషయంలో ఆంధ్ర - తెలంగాణకు చాలా తేడా ఉందన్నారు. రెండు ప్రాంతాల ప్రజల జీవన విధానం వేర‌న్నారు. `తెలుగు అనే ఐడేంటీనే లేదు. భాషాప్రయుక్త రాష్ట్రాల‌ పేరుతో ఆంధ్ర - తెలంగాణ విలీనం చారిత్రక తప్పిదం. నిజాం హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా వర్థిల్లింది` అని కేసీఆర్ అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెం1గా నిలిచిందని సీఎం వివరించారు.

300 ఏళ్ల క్రితం మార్వాడీలు హైదరాబాద్ వచ్చి తెలంగాణ మా మాతృభూమి అని గర్వంగా చెప్పుకుంటున్నారని కేసీఆర్ వివ‌రించారు. ఆరు నెలల్లోనే విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడ్డామ‌న్నారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థితికి చేరుకున్నామ‌ని సీఎం తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాల‌ కంటే ముందుందన్నారు. తెలంగాణ కంటే 17 చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోస్తున్నం. 38 లక్షల గొర్రెలను పంపిణి చేసి అనుకున్న లక్ష్యం దిశగా పోతున్నాం. రూ.100 ఉన్న ఆసరా పెన్షన్‌ ను రూ. 1000కి పెంచాం. వ్యవసాయంలో కూడా తెలంగాణ ఆదర్శంగా నిలవబోతున్నది. దేశంలోనే తెలంగాణ అగ్రరాష్ట్రంగా నిలుస్తుందనే నమ్మకంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామ‌న్నారు.

పట్టుదలతో అభివృద్ధి సాధించి ఆచరణలో చూపామ‌ని సీఎం తెలిపారు. హైదరాబాద్ చరిత్ర తెలిసిన వారెవరైనా అది తెలంగాణలో అంతర్భాగమేనని అంగీకరిస్తారు. ఎన్నో మతాలవాళ్లు, ఎన్నో ప్రాంతాల వాళ్లు దశాబ్ధాలుగా ఇందులో భాగమై జీవిస్తున్నారు. ఎవరో కొందరు ఆంధ్ర నేతలు మాత్రమే ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ పై అర్ధంపర్థంలేని వాదనలు చేశారు. రాష్ర్టాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే నెం.1 రాష్ట్రంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌ కు దేశ రెండో రాజధానిగా గౌరవమిస్తామంటే స్వాగతిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. త‌ద్వారా కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపారు.