Begin typing your search above and press return to search.

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఏపీని కంట్రోల్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   27 Oct 2021 12:30 AM GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఏపీని కంట్రోల్ చేస్తున్నారా?
X
తెలంగాణ ముఖ్యమంత్రి, మాట‌ల మాంత్రికుడు.. కేసీఆర్‌.. ఏం మాట్లాడినా.. దాని వెనుక చాలా వ్యూహాలు ఉంటాయ‌ని అంటారు.. ప‌రిశీల‌కులు. అడుగు తీసి అడుగు వేస్తే.. ఆయ‌న లాభం చూసుకోకుండా.. ఏమీ చేయ‌ర‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుంటాయి. తాజాగా టీఆర్ ఎస్ ప్లీన‌రీలో మ‌రోసారి అధ్య‌క్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌.. కీల‌క ఉప‌న్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా.. ఏపీపై ఆయ‌న కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు.. తీవ్ర సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ``ఏపీ ప్ర‌జ‌లు మావైపు చూస్తున్నారు. ఏపీలోనూ పార్టీ పెట్టాల‌ని.. కోరుతున్నారు. వేలాది మంది మాకు విజ్ఞ‌ప్తులు పంపుతున్నారు`` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. తాము ప్రారంభించి అమ‌లు చేస్తున్న ద‌ళిత బంధు వంటి ప‌థ‌కాల‌ను త‌మ‌కు కూడా.. అమ‌లు చేయాల‌ని.. ఏపీ ప్ర‌జ‌లు కోరుతున్నార‌ని.. అన్నారు. సో.. ఇత‌మిత్థంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇవీ. కానీ.. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌ల వెనుక చాలా అంత‌రార్థం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రెండు మూడు కార‌ణాలు ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఒక‌టి.. ఏపీ ప్ర‌భుత్వాన్ని నియంత్రించ‌డం.. రెండు.. తెలంగాణ‌లో సంపూర్ణ సక్సెస్‌ను సాధించామ‌ని.. ప్ర‌జ‌ల దీవెన‌లు త‌మ‌కే ఉన్నాయ‌ని.. ప‌రోక్షంగా మ‌రింత చెప్పుకోవ‌డం.. మూడు.. ఏపీలో ఎప్పుడైనా అడుగు పెట్టేందుకు త‌మ‌కు ఛాన్స్ ప్ర‌జ‌లే ఇస్తున్నార‌ని.. చెప్పుకోవ‌డం ద్వారా.. ఏపీ రాజ‌కీయ పార్టీల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేయడం.

వీటిని నిశితంగా ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం ఏపీ-తెలంగాణ‌ల మ‌ధ్య జ‌ల వివాదాలు స‌హా.. ఉద్యోగుల విభ‌జ‌న వంటి విష‌యాలు వివాదంగానే ఉన్నాయి. అదేస‌మ‌యంలో విద్యుత్ వాడ‌కానికి సంబంధించి 5000 కోట్లు తెలంగాణ ఇవ్వాల్సి ఉంది. ఈ క్ర‌మంలో ఏపీని సాధ్య‌మైనంత నోరు నొక్కేందుకు ప్ర‌య‌త్నిస్తే.. త‌ప్ప‌.. తెలంగాణ‌లో కేసీఆర్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వాన్ని నియంత్రించే ఉద్దేశం ఉంద‌ని అంటున్నారు. తాము ఏపీలోకి అడుగు పెడితే.. త‌మ వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతార‌నే.. వ్యాఖ్య‌ల వెనుక‌.. ప్ర‌భుత్వాన్ని నియంత్రించే ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

ఇక‌, తెలంగాణ దాటి.. పార్టీని విస్త‌రిస్తున్నాన‌నే సంకేతాలు ఇస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇది.. తెలంగాణ‌లో త‌న పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసుకునే దిశ‌గా కేసీఆర్ అడుగులు వేయ‌డ‌మేన‌ని అంటున్నారు. తెలంగాణ‌లో పార్టీని కేవ‌లం రాష్ట్రానికి ప‌రిమితం చేయ‌డం కాకుండా.. పొరుగు రాష్ట్రానికి విస్త‌రించ‌డం ద్వారా.. త‌న బ‌లం చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తూ.. తెలంగాణ ప్ర‌తిప‌క్షాల‌ను డోలాయ‌మానంలో ప‌డేస్తున్నార‌నేది ఒక వాద‌న‌. ఇక‌, ఏపీలో ఎప్పుడైనా అడుగు పెడ‌తామ‌నే సంకేతాలు సంపూర్ణంగా ఇవ్వ‌డం ద్వారా.. ఇక్క‌డి రాజ‌కీయ ప‌క్షాల‌కు పోటీ లేదు.. అనుకునే స్థాయిని లేకుండా చేయ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి కేసీఆర్ వ్యాఖ్య‌లు అనేక కోణాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.