Begin typing your search above and press return to search.

కేసీఆర్ సారు... గిట్ల డ‌బ్బులు దానం అడుగుడు ఏందో!

By:  Tupaki Desk   |   4 Feb 2022 12:31 PM GMT
కేసీఆర్ సారు... గిట్ల డ‌బ్బులు దానం అడుగుడు ఏందో!
X
తెలంగాణ ధ‌నిక రాష్ట్రం అంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ఆర్థిక లెక్క‌లు కూడా ఆయ‌న వివ‌రిస్తుంటారు. మ‌రోవైపు, కీల‌క సంక్షేమ ప‌థ‌కాల‌ను సైతం ఆయ‌న ప్ర‌క‌టిస్తుంటారు. అయితే, తాజాగా మ‌రో ప‌థ‌కం ప్ర‌క‌టించారు. ఇందులో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏంటంటే... ఈ కీల‌క ప‌థకానికి దాతల నుంచి విరాళాలు ఆహ్వానించ‌డం!

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ద‌శ‌ను మార్చేందుకు తాజాగా సీఎం కేసీఆర్ ఓ కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి ‘మన ఊరు- మన బడి’గా, పట్టణ ప్రాంతాల్లో ‘మన బస్తీ- మన బడి’గా పేర్లు ఖరారు చేశారు. రాబోయే మూడేళ్ల‌లో మూడు విడతల్లో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం కోసం రూ.7,289.54 కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలనా పరమైన అనుమతులిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా జీవో 4 జారీ చేశారు. మొదటి విడుతలో 2021-22 విద్యాసంవత్సరంలో 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్లతో వసతులు కల్పిస్తారు.

మండలం యూనిట్‌గా ఎక్కువమంది విద్యార్థులున్న పాఠశాలల్లో తొలుత ఈ పథకాన్ని అమలుచేస్తారు. పథకం పూర్తిగా పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఆధ్వర్యంలోనే అమలవుతుంది. పనులు పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తారు. పాఠశాల అభివృద్ధికి పది లక్షలు విరాళం ఇచ్చే దాతల పేర్లను పాఠశాలకు లేదా తరగతి గదికి పెట్టేందుకు అవకాశం కల్పించారు. 2 లక్షలు ఇస్తే పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ)లో సభ్యుడిగా జాబితాలో చేరొచ్చు. ఈ మేరకు పరిపాలన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. పాఠశాల స్థాయిలో చెక్కులు, చెల్లింపులన్నీ ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్‌, ప్రధానోపాధ్యాయుడు, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, సర్పంచ్‌లతో కూడిన కమిటీ సంయుక్తంగా చేపడుతుంది. ప్రతి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేస్తారు. వీరు దాతలతోపాటు సీఎస్సార్‌ నిధులను సమీకరించేందుకు సాయం చేస్తారు. ధ‌నిక రాష్ట్రం అని చెప్పే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా దాత‌ల స‌హాయం కోసం ఏకంగా ఆదేశాలు ఇవ్వ‌డం, ఏకంగా క‌మిటీ ఏర్పాటుకు ఓకే చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.