Begin typing your search above and press return to search.

మళ్ళీ ఢిల్లీ యాత్ర మొదలు పెట్టేశారా ?

By:  Tupaki Desk   |   22 May 2022 3:29 AM GMT
మళ్ళీ ఢిల్లీ యాత్ర మొదలు పెట్టేశారా ?
X
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పటం కోసం కేసీయార్ మళ్ళీ ఢిల్లీ బాట పట్టారు. శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న కేసీయార్ శనివారం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఆదివారం చండీగఢ్ చేరుకోబోతున్నారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 మంది కుటుంబాలను పరామర్శించనున్నారు. నిజానికి రైతులతో కానీ వారి కుటుంబాలతో కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా పనిగట్టుకుని మరీ వెళ్ళి వారిని పరామర్శించి పరిహారంగా తలా రు. 3 లక్షల చెక్కును అందించబోతున్నారు.

ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కూడా పాల్గొనబోతున్నారు. తర్వాత హైదరాబాద్ కు వచ్చేస్తారు. మళ్ళీ బెంగుళూరుకు వెళ్ళి మాజీ ప్రధానమంత్రి దేవేగౌడతో భేటీ కాబోతున్నారు. అట్నుంచి అటే మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధీలో సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో సమావేశమవుతారు. అక్కడి నుండి షిరిడీ దర్శనం చేసుకుని హైదరాబాద్ కు వచ్చేస్తారు.

మళ్ళీ 29, 30 తేదీల్లో పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాలకు వెళ్ళి ముఖ్యమంత్రులతో భేటీ కాబోతున్నారు. ఇంతమంది ముఖ్యమంత్రులను కలవటం, అన్నాహజారేని కలవటం అంతా ఎందుకు చేస్తున్నారు ? ఎందుకంటే కేవలం నరేంద్ర మోడీ అంటే మంట కారణంగానే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించి మోడిని దెబ్బకొట్టాలనే ఏకైక టార్గెట్ తోనే కేసీయార్ ఇదంతా చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జాతీయ రాజకీయాల్లో కేసీయార్ కు అసలు క్రెడిబులిటీయే లేదు.

మాట నిలకడలేని తనమే కేసీయార్ కు పెద్ద మైనస్ గా మారింది. గతంలో కేంద్రంపై యుద్ధమే అని ప్రకటించి వెంటనే మోడీని కలిసి దణ్ణం పెట్టుకుని వచ్చారు. మరోసారి ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానన్నారు ఏమి సృష్టించారో కేసీయార్ కే తెలియాలి. తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకోవటమే సమస్యగా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్ లేకుండా రాజకీయం చేయాలని చూడటం కూడా పెద్ద అవరోధంగా మారింది. కేసీయార్ కలుస్తున్న చాలామంది సీఎంలలో కాంగ్రెస్ లేకుండా బీజేపీపి ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పేశారు. మరీ సారి ఏమి చేస్తారో చూడాలి.