Begin typing your search above and press return to search.

గమనించారా? ఫాంహౌస్ అని రాయట్లేదు.. ఎర్రవెల్లి నివాసమట

By:  Tupaki Desk   |   28 Feb 2022 7:40 AM GMT
గమనించారా? ఫాంహౌస్ అని రాయట్లేదు.. ఎర్రవెల్లి నివాసమట
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్కలు వేరుగా ఉంటాయి. మామూలుగా.. అతి సాదాసీదాగా అనిపించే అంశాల వెనుక కూడా ఆయన ప్లానింగ్ ఉంటుంది. ఇందుకు తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ ఎంత పాపులర్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో బండి సంజయ్.. రేవంత్ రెడ్డిల పుణ్యమా అని.. ఎర్రవెల్లి ఫాంహౌస్ పేరుతో జరిగిన రచ్చ సీఎం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారిందటున్నారు. పదే పదే ఫాంహౌస్ అన్న మాట రావటంతో ప్రజల్లో ఒకలాంటి వ్యతిరేకత పెరిగిందన్న అభిప్రాయం అధికార వర్గాల్లోనే ఉంది.

అందుకే.. ఆ అంశం మీద ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్.. ఈ మధ్యన జరిగిన మీడియా సమావేశంలో ఎర్రవెల్లి ఫాంహౌస్ ను ప్రస్తావించినప్పుడు.. అది ఫాంహౌస్ కాదు.. ఫార్మర్ హౌస్ అని చెప్పేశారు. ఏళ్లకు ఏళ్లుగా ఫాంహౌస్ గా పిలుస్తున్న దానిని.. ఫార్మర్ హౌస్ గా సీఎం చెప్పినంతనే మారుతుందా? అని చాలామందికి సందేహం కలిగింది. అనూహ్యమైన పరిణామం ఏమంటే.. ఇటీవల కాలంలో ఎర్రవెల్లి ఫాంహౌస్ అనే పదాన్ని కొన్ని మీడియా సంస్థలు రాయకుండా.. ఎర్రవెల్లిలోని సీఎం నివాసంలో అంటూ కొత్త తరహాలో రాస్తున్న వైనం ఈ మధ్యన మొదలైంది.

ఫాంహౌస్ పేరుతో జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు.. తన నివాసంగా పేర్కొనాలన్న ఆదేశాలు మీడియా సంస్థల్లో తాజా మార్పునకు కారణంగా చెబుతారు. దీంతో.. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ఫాంహౌస్ గా పిలిచిన దానినే.. తాజాగా అందుకు భిన్నంగా ఎర్రవెల్లిలో సీఎం నివాసం అన్న మాటను ఉపయోగించటం చూస్తే.. చిన్న విషయాలపైనా కేసీఆర్ ఎంత ఎక్కువ శ్రద్ధ చూపుతారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అందుకే అనేది.. కేసీఆరా మజాకానా అని?