Begin typing your search above and press return to search.

కట్టప్పా.. కాకరకాయా? ఏం చేస్త‌రు?: మోడీపై కేసీఆర్ ఫైర్‌

By:  Tupaki Desk   |   10 July 2022 3:25 PM GMT
కట్టప్పా.. కాకరకాయా? ఏం చేస్త‌రు?:  మోడీపై కేసీఆర్ ఫైర్‌
X
తెలంగాణలో మూడో వంతు మెజార్టీతో టీఆర్ ఎస్ గెలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. మొత్తం 119 స్థానాల్లో 110 సీట్లున్న చోట ఏక్‌నాథ్ షిండే వస్తారా? అని ప్రశ్నించారు. ``కట్టప్పలా.. కాకరకాయా? కట్టప్పలు, ఏక్‌నాథ్ షిండే.. ఇలాంటి కుక్కమూతి పిందెలా రాష్ట్రానికి కావాల్సింది? ఏక్‌నాథ్ షిండే వచ్చి ఏం చేశారు? మహారాష్ట్రలో 20శాతం విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. మీ వల్ల ఏమవుతుంది. మన్నూ మశానం తప్ప`` అని కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు.

నుపుర్‌ శర్మ వ్యాఖ్యలతో విదేశాల్లో భారత రాయబారిని నిలదీస్తే క్షమాపణ చెప్పారన్నారు. బీజేపీ అసమర్థ విధానాల వల్ల భారత్‌ పరువుపోతోందని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని విశ్రాంత జడ్జిలతో లేఖ రాయిస్తారా? అని నిలదీశారు.  బీజేపీ నేతలు సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి నడుస్తోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

సర్కారు నడుపుతున్నారా?.. గూండాయిజం చలాయిస్తున్నారా? అని నిలదీశారు. ఏక్‌నాథ్ షిండే వచ్చాక మహారాష్ట్రలో 20 శాతం విద్యుత్‌ ఛార్జీలు పెంచారని తెలిపారు. దేశంలో అసమర్థ పాలన వల్లే దుష్ఫలితాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ జీడీపీ 128.3 శాతం కాగా.. కేంద్ర ప్రభుత్వ జీడీపీ మాత్రం 89.6 శాతంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే తెలంగాణ జీడీపీ మరింత పెరిగేదని స్పష్టం చేశారు.

బీజేపీ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కేంద్రంలో కూడా తెలంగాణ మాదిరి సర్కారు రావాల్సి ఉందని తెలిపారు. ఏ రకమైనా డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలో ప్రజలు తేలుస్తారని కేసీఆర్ అన్నారు. ``బీజేపీ పాలన అంతా అప్రజాస్వామిక విధానాలు, అవినీతి, కుంభకోణాలమయం. కేంద్రంలో దద్దమ్మ ప్రభుత్వం ఉండటం వల్ల తెలంగాణ ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు నష్టపోయింది. అసెంబ్లీలో ఇదే విషయం చెప్పా.`` అని కేసీఆర్ వెల్ల‌డించారు.

దేశంలో ఏటా కోటి 30 లక్షల ఉద్యోగాలు కోల్పోతున్నారని అన్నారు. వీళ్ల చేతగాని తనాన్ని ప్రజలు చూశారని బీజేపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. అందుకే కేంద్రంలోని ప్రభుత్వం మారాలని చెబుతున్నామ‌న్నారు. తప్పకుండా మారుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ``డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని మోడీ చెప్పారు. ఈ విషయంలో మోదీకి థ్యాంక్స్‌ చెబుతున్నా. తెలంగాణ సర్కారు ఇంజిన్‌ స్పీడ్‌గా ఉంది. కాబట్టే కేంద్రంలో కూడా తెలంగాణ సర్కారులా స్పీడ్‌గా ఉన్న ప్రభుత్వం రావాలి. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం పోవాలి.. బీజేపీయేతర ప్రభుత్వం రావాలి. కేంద్ర ప్రభుత్వం వేగం తక్కువ.. రాష్ట్ర ప్రభుత్వం వేగం ఎక్కువ. కేంద్రంలో తప్పకుండా బీజేపీయేతర డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సి ఉంది.`` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.