Begin typing your search above and press return to search.

జనాలు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే.. రాజకీయం అవసరమా కేసీఆర్?

By:  Tupaki Desk   |   11 July 2022 4:32 AM GMT
జనాలు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే.. రాజకీయం అవసరమా కేసీఆర్?
X
ఓవైపు వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు.. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు మూడు రోజులు సెలవులు.. వీటితో పాటు.. వర్షం వేళ అవసరమైతే తప్పించి ఇంట్లో నుంచి రావొద్దన్న సూచనలు చేస్తున్న వేళ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వ వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా? లేదా? ప్రజల ఇబ్బందుల్ని.. సమస్యల్ని వీలైనంత తగ్గించటానికి ఏం చేయాలి? ఏం చేస్తే మంచిది? వర్షం కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి అధికారులకు వస్తున్న ఫోన్ల సారాంశం ఏమిటి? రాష్ట్రంలోని ఏయే ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? చికాకులు.. సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలేంటి? లాంటివి ఎన్నో ఉంటాయి.

వీటిని సమన్వయం చేసుకొని.. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొనే కష్టాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి.. ఆ విషయాన్ని అధికారులకు వదిలేసి.. ఆదరాబాదరాగా ఆదివారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టేసి.. బీజేపీ మీదా.. కేంద్ర ప్రభుత్వం మీదా.. ప్రధాని నరేంద్ర మోడీ మీద నోటికి వచ్చినట్లుగా తిట్టిపోయాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రాథమిక ప్రశ్న. ఆదివారం ప్రెస్ మీట్ ను మూడు రోజుల వర్షాల తర్వాత పెడితే ఏమైనా అవుతుందా? అన్నది మరో సందేహం. అలాంటివి వదిలేసి.. రెండు గంటల పాటు.. తనకున్న ఆగ్రహాన్ని.. ఆవేశాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది?

ఓపక్క వర్షంకారణంగా సమస్యలతో కిందా మీదా పడుతున్న ప్రజల్ని.. వారి కష్టాల్ని వదిలేసి.. తన రాజకీయ ఎజెండాను ఆవిష్కరించాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. టైమింగ్ విషయంలో పక్కాగా ఉండే గులాబీ బాస్.. తన తీరుకు భిన్నంగా రాంగ్ టైంలో పెట్టిన ఈ ప్రెస్ మీట్ పలువురిని విస్మయానికి గురి చేసింది. టీవీల్లో సీఎం కేసీఆర్ ఆగ్రహాన్ని విన్న ప్రజలు.. తన మాటలకు ఎలా రియాక్టు అవుతారన్న కనీస విషయాన్ని కేసీఆర్ మిస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి మోడీని ఏకిపారేయటానికి ఎంచుకున్న ముహుర్తం విషయంలో కేసీఆర్ తప్పులో కాలేశారన్న మాట వినిపిస్తోంది. ఎందుకిలా చేశారు కేసీఆర్? అని అడిగే ధైర్యం పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ ఎవరికైనా ఉందంటారా?