Begin typing your search above and press return to search.

చెప్పిన‌ట్లే జ‌రిగింది.. నివాళులు అర్పించిన కేసీఆర్

By:  Tupaki Desk   |   1 May 2019 10:41 AM GMT
చెప్పిన‌ట్లే జ‌రిగింది.. నివాళులు అర్పించిన కేసీఆర్
X
అనుకున్న‌దే జ‌రిగింది. అంచ‌నా నిజ‌మైంది. చాలా త‌క్కువ సంద‌ర్భాల్లో మాత్ర‌మే నివాళులు అర్పించేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. తాజాగా అనారోగ్యంతో మ‌ర‌ణించిన జ‌స్టిస్ సుభాష‌ణ్ రెడ్డికి నివాళులు అర్పించారు. ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ర‌ణించినా.. వారి నివాళులు అర్పించేందుకు రాని కేసీఆర్.. సుభాష‌ణ్ రెడ్డి విష‌యంలో మాత్రం ఆయ‌న త‌న తీరును మార్చుకున్నారు.

తెలంగాణ ఉద్య‌మం కీల‌క‌ద‌శ‌లో ఉన్న‌ప్పుడు.. మాన‌వ‌హ‌క్కుల సంఘం ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన జ‌స్టిస్ సుభాష‌ణ్ రెడ్డి ఇచ్చిన ఆదేశం తెలంగాణ ఉద్య‌మ రూపురేఖ‌ల్ని మార్చ‌ట‌మే కాదు.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు సంబంధించిన కీల‌క అడుగు ప‌డింద‌ని చెప్పాలి. నిర‌స‌న చేస్తున్న కేసీఆర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆయ‌న్ను హైద‌రాబాద్ కు త‌ర‌లించాల‌ని.. నిమ్స్ లో చేర్చాల‌న్న ఆదేశాన్ని ఇచ్చింది జ‌స్టిస్ సుభాష‌ణ్ రెడ్డిగా చెబుతారు.

ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి తెలిసిందే. జ‌స్టిస్ సుభాష‌ణ్ రెడ్డి నివాసానికి వ‌చ్చిన కేసీఆర్ ఆయ‌న పార్థిప దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. సీఎం కేసీఆర్‌ రావ‌టానికి ముందు సుభాష‌ణ్ రెడ్డికి నివాళులు అర్పించిన వారిలో రెండు తెలుగు రాష్ట్రాల‌ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారు.

ఇక‌.. కేసీఆర్ వెంట డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ.. మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ త‌దిత‌రులు ఉన్నారు. జ‌స్టిస్ సుభాష‌ణ్ రెడ్డికి నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌ముఖులు త‌ర‌లివ‌చ్చారు.