Begin typing your search above and press return to search.

అంద‌రికీ అంటూనే గెలుపు గుర్రాల లెక్కేంది?

By:  Tupaki Desk   |   4 Nov 2017 5:24 AM GMT
అంద‌రికీ అంటూనే గెలుపు గుర్రాల లెక్కేంది?
X
ఎప్పుడేం మాట్లాడ‌తారో.. ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో అర్థంకాకుండా వ్య‌వ‌హ‌రించ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అల‌వాటే. కాక‌పోతే.. తానేం చెప్పినా అంద‌రి మ‌న‌సుల్ని దోచుకునేలా.. న‌మ్మ‌కం క‌లిగేలా మాట‌లు చెప్ప‌టంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.

ఈ మ‌ధ్య‌న సోష‌ల్ మీడియాలో ఒక క్లిప్ బ్ర‌హ్మాండంగా వైర‌ల్ అవుతోంది. వివిధ సంద‌ర్భాల్లో కొలువుల మీద కేసీఆర్ ఏం చెప్పార‌న్నది ఆ వీడియో క్లిప్ సారాంశం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో మాట్లాడుతూ.. ప్ర‌తి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వ‌టం ఖాయ‌మ‌ని కేసీఆర్ న‌మ్మ‌కంగా చెప్పిన మాట‌తో పాటు.. మ‌రో సంద‌ర్భంలో ల‌క్ష ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన మాట ఉంది.

ఇక్క‌డితో అయిపోతే ఈ క్లిప్ గురించి మాట్లాడుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇక్క‌డే అస‌లు విష‌యం ఉంది. ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయండి? అంద‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇచ్చుడు సాధ్య‌మేనా? అలా ఎలా మాట్లాడ‌తారండీ అంటూ విరుచుకుప‌డిన కేసీఆర్ మాట‌ల్ని చూస్తే అర్థ‌మ‌య్యేదేమంటే.. ఏ టైంలో అయినా క‌న్వీన్స్ చేసేలా మాట్లాడ‌టం ఆయ‌న‌కు మాత్ర‌మ సాధ్య‌మ‌నిచెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌రో ఏడాదిన్న‌ర త‌ర్వాత జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపుపై ఇప్ప‌టికే ప‌లు వ్యాఖ్య‌లు చేశారు కేసీఆర్‌. కేవ‌లం వారం వ్య‌వ‌ధిలో ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన రెండు విరుద్ధ వ్యాఖ్య‌లు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభ వేళ నేత‌ల‌తో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌ని.. అల‌వోక‌గా 90 సీట్లు గెలిచేస్తామ‌ని.. కాస్త దృష్టి పెడితే వంద ప‌క్కా అని.. మ‌రికాస్త ట‌ఫ్ ఫైట్ ఇస్తే మ‌రో ఏడెనిమిది సీట్లు గెల‌వ‌టం ఖాయ‌మ‌ని చెప్పారు. అక్క‌డితో ఆగ‌ని ఆయ‌న సిట్టింగులంద‌రికి సీట్లు ఇస్తామ‌ని.. ఎన్నిక‌ల ఖ‌ర్చుకు ఎంచ‌క్కా చెక్కులు ఇచ్చి పంపుతామ‌ని.. అది కూడా నెల‌ల ముందే టికెట్ల‌ను క‌న్ఫ‌ర్మ్ చేస్తామ‌ని చెప్పి సిట్టింగ్ నేత‌ల దిల్ కుష్ అయ్యే మాట‌ల్ని చెప్పారు.

ఈ మాట‌ల్ని చెప్పి ఊహ‌ల్లో విహ‌రించేలా చేసిన కేసీఆర్‌.. నాలుగు రోజులు గ‌డ‌వ‌కముందే అందుకు పూర్తి విరుద్ధ‌మైన వ్యాఖ్య‌ల్ని చేయ‌టం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాల‌కే తాను టికెట్లు ఇస్తాన‌ని చెప్పి షాకిచ్చారు.

సిట్టింగులకు టికెట్లు ప‌క్కా అని చెప్పినంత‌నే గెలుపు గుర్రాల్ని సీన్లోకి తేవ‌టంతో గులాబీనేత‌ల‌కు ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. దీంతో.. నిన్న‌టి వ‌ర‌కూ ఊహ‌ల గుర్రాల మీద స్వారీ చేసినోళ్లంతా ఇప్పుడు టెన్ష‌న్ ప‌డిపోయే ప‌రిస్థితి.మొత్తానికి త‌న మాట‌ల‌తో విపక్షాల్నే కాదు సొంతోళ్ల‌ను కూడా చెడుగుడు ఆడుకోవ‌టంకేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మని చెప్ప‌క త‌ప్ప‌దు.