Begin typing your search above and press return to search.

అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ స‌త్తా తెలుస్తుంద‌ట‌

By:  Tupaki Desk   |   9 Dec 2016 10:12 AM GMT
అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ స‌త్తా తెలుస్తుంద‌ట‌
X
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజుల పాటు నిర్వహించాలని గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ సార‌థ్యంలోని ప్రభుత్వం యోచిస్తుంది. శీతాకాల సమావేశాలను ఐదారు రోజులతో ముగించకుండా చూడాల‌ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారని తెలిసింది. ప్రగతిభవన్‌లో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు, అసెంబ్లీ కార్యదర్శితో శీతాకాల అసెంబ్లీ సమావేశాల సన్నాహక సమావేశాన్ని సీఎం కేసీఆర్‌ నిర్వహించారు. శాసనసభను అర్థవంతంగా నడుపుకోవాలని, ప్రతిపక్షాలే ఇక చాలు అనేదాక సమావేశాలు జరుపాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని తెలిసింది.

ప్రజాసమస్యలను అసెంబ్లీ వేదికగా చర్చించడానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధమేనని కేసీఆర్ ఈ సంద‌ర్భంగా అన్నట్టు తెలిసింది. గత ప్రభుత్వాలు కంటితుడుపుగా ఐదారు రోజులు సమావేశాలు నిర్వహించి పారిపోయేవని..మనకా అవసరం లేదని ఆయన అన్నట్టు తెలిసింది. "ఏ విషయాన్ని దాచుకోం.. పారి పోం.. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరుగాలి. ప్రజాసమస్యలు పరిష్కారం కావాలి" అని కేసీఆర్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయనేది ఈ నెల 15న జరుగనున్న అసెంబ్లీ, కౌన్సిల్ బీఏసీ సమావేశాల్లో తేలనున్నది. కాగా సమావేశాలను ఆషామాషీగా తీసుకోవద్దని సీఎం మంత్రివర్గ సహచరులతో అన్నట్టు కూడా తెలిసింది. వివిధ శాఖల అధికారులు కూడా సభ్యులు ఏ విషయం అడిగినా పూర్తి సమాచారం అందజేసేలా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు చెప్పినట్టు తెలిసింది. ఇక ఈనెల 10న జరిగే క్యాబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాలే ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉందని స‌మాచారం.

ఇదిలాఉండ‌గా...అసెంబ్లీ సమావేశాలకు సచివాలయ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సమావేశాల నోటిఫికేషన్ మొదలుకుని రోజువారీ ఎజెండా, సభలో చర్చకువచ్చే ప్రశ్నలు, సమావేశాలకు సంబంధించి ఇతర సమాచారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మెయిల్ ద్వారా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. సమాచారం పంపటంతోపాటు మెయిల్ ద్వారా సదరు సమాచారం పంపినట్టు తెలుపుతూ సభ్యులను ఎస్‌ఎంఎస్ ద్వారా అలర్ట్ చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మెయిల్స్, టెలిఫోన్‌నంబర్లు అప్‌డేట్ చేస్తున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో రోజు వారి ఎజెండా, చర్చకు వచ్చే ఆంశాలు, ప్రశ్నలకు సంబంధించి సభ్యులకు ప్రింటెడ్ కాపీలు, ఇతర సమాచారాన్ని మెసెంజర్ ద్వారా (మ్యాన్యువల్ సిస్టమ్) పంపించే విధానాన్ని ఈ శీతాకాల సమావేశాలతోనే ముగించాలని అసెంబ్లీ అధికారులు భావిస్తున్నారు. ఈ సమావేశాల్లోనే పేపర్ రహిత ఇ-సమాచార వ్యవస్థను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ రాజాసదారాం ఈ విభాగాలను పర్యవేక్షించే అధికారులను ఆదేశించారు.