Begin typing your search above and press return to search.

కేసీఆర్ : నూరు మాట దేవుడెరుగు నూర్పు సంగ‌తి చూడు !

By:  Tupaki Desk   |   14 Jun 2022 11:30 PM GMT
కేసీఆర్ : నూరు మాట దేవుడెరుగు నూర్పు సంగ‌తి చూడు !
X
సారు కారు నూరు అనే నినాదంతో వెళ్లాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే నూరు మాట దేవుడెరుగు ముందు రైతుల‌కు చెల్లించాల్సిన ధాన్యం కొనుగోలు బ‌కాయిలు చెల్లించాల‌ని విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. తాజాగా మంగ‌ళ‌వారం (జూన్ 14, 2022 ) నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు బంద్ చేయాల‌ని నిర్ణ‌యించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల‌కు ఇప్ప‌టిదాకా ఐదు వేల ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌లు చెల్లించారు.

కానీ వారికి చెల్లించాల్సింది ఇంకా నాలుగు వేల కోట్లకు పైగా బ‌కాయి ఉంది. ఇక్క‌డి బ‌కాయిలు చెల్లించ‌కుండా ఎక్క‌డో ఉన్న పంజాబ్ రైతుల‌కు సాయం చేయ‌డం ఏంట‌ని విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్న‌దే ఇందుకు ! కానీ కేసీఆర్ మాత్రం జాతీయ స్థాయి నాయ‌కుడిగా ఎద‌గాల‌ని అనుకుంటున్నారు క‌నుక విశాల దృక్ప‌థంతో ఆ ప్రాంత రైతుల‌కు సాయం చేశానని ప‌దే పదే అంటున్నారు.

వాస్త‌వానికి పౌర సరఫరాల సంస్థ ద్వారా రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది రైతుల నుంచి 48.15 లక్షల టన్నుల ధాన్యం సేక‌రించిన‌ప్ప‌టికీ బ‌కాయిలను మాత్రం పూర్తిగ చెల్లించ‌కుండానే సంబంధిత కొనుగోలు కేంద్రాల‌ను మాత్రం మూసివేయాల‌ని నిర్ణ‌యించ‌డం ఇప్పుడు రైతుల నిరాశ‌కు కార‌ణం అయింది.

మ‌రోవైపు సీఎం ముంద‌స్తుకు పోవాల‌ని అనుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ లో ముంద‌స్తు ప్ర‌క‌ట‌న చేస్తే చేయొచ్చు. క‌ర్ణాట‌క‌తో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఇదే క‌నుక జ‌రిగితే కేసీఆర్ తోస‌హా మిగ‌తా ముఖ్య నాయ‌కులంతా మ‌రింత క‌సిగా ప‌నిచేయాలి.

ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ ల‌ను ఇప్పుడు నిలువ‌రించ‌డం కేసీఆర్ కు క‌ష్ట సాధ్య‌మే ! కష్ట సాధ్య‌మే కాని అసాధ్యం అయితే కాదు అని పైకి గులాబీ దండు చెబుతున్నా, కొన్ని చోట్ల జీరో రిజ‌ల్ట్ తో ఉన్న కారు పార్టీకి మైలేజీ తీసుకురావ‌డం ఇప్ప‌టికిప్పుడు సులువు కాదు అనే తేలుస్తున్నారు రాజకీయ పరిశీల‌కులు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ కేసీఆర్ తో పాటే జ‌గ‌న్ కూడా ముంద‌స్తుకు వెళ్తారా అన్న డౌట్ కూడా రైజ్ అవుతోంది.