Begin typing your search above and press return to search.

తెలంగాణ కాదు.. దేశం గురించే కేసీఆర్ చింత‌.. ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   28 Aug 2022 3:30 AM GMT
తెలంగాణ కాదు.. దేశం గురించే కేసీఆర్ చింత‌.. ఏమ‌న్నారంటే
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు రాష్ట్రం కంటే.. కేంద్రం.. జాతీయ రాజ‌కీయాల‌పైనే ఎక్కువ‌గా ఆస‌క్తి ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే ఆయ‌న రాష్ట్ర స‌మ‌స్య‌ల‌క‌న్నా.. దేశ స‌మ‌స్య‌ల‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. తాజాగా ఆయ‌న రైతు నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కేంద్ర ప్రభుత్వ పాలన గాడిలో పడకుండా ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి కారణాలు అన్వేషించాలన్నారు.

స్వాతంత్య్ర పోరాటం ముగిసిన దశాబ్దాల తర్వాతా దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలు, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా ఎందుకు పోరాటాలకు సిద్ధపడుతున్నారో ఆలోచించాల్సి ఉందని చెప్పారు. దేశంలోని రైతు సమస్యలకు ఎందుకు పరిష్కారం దొరకడం లేదో.. దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాల్సిన వారు.. నిర్లక్ష్యం వహిస్తుండటం, ప్రజల కోసం పనిచేసే వారిని పాలకులే ఇబ్బందులకు గురిచేసే విధానం దేశంలో కొనసాగుతుండటం మన దురదృష్టకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ప్రజాసంక్షేమం కోరుకునే శక్తులంతా సంఘటితం కావాల్సి ఉందని తెలిపారు. అడ్డంకులను అధిగమిస్తూ ఐక్యంగా లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందని వివరించారు. అందుకే.. రండి.. చేతులు క‌ల‌పండి.. అని ఆయ‌న విప‌క్షాల‌కు పిలుపునిచ్చారు. అమెరికా, చైనా వంటి ఏ దేశాలతో పోల్చి చూసినా నీటి వనరులు, వ్యవసాయయోగ్య భూమి, మానవ వనరులు భారత్‌లోనే పుష్కలంగా ఉన్నాయని సీఎం వివరించారు. దేశంలోని 40 వేల కోట్ల ఎకరాల సాగుయోగ్యమైన భూమికి 40 వేల టీఎంసీల నీళ్లు మాత్రమే అవసరమని.. తాగునీటికి 10 వేల టీఎంసీలైతే సరిపోతాయని పునరుద్ఘాటించారు.

70 వేల టీఎంసీల నీటి వనరులు దేశంలో అందుబాటులో ఉన్నా ఎందుకు సాగు, తాగునీరు కోసం ప్రజలు ఇంకా ఎదురు చూడాల్సి వస్తోందని కేసీఆర్‌ ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రైతులందరికీ ఉచితంగా విద్యుత్, సాగునీరు అందిస్తున్నా కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయట్లేదని కేసీఆర్ ప్రశ్నించారు.

రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి రాష్ట్రంలో ఉన్నట్లు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్‌లు ఉన్నాయా అని నిలదీశారు. విద్యుత్ ఉండి, కష్టపడే రైతులున్నా దేశంలో వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, కేంద్ర పాలకుల నిర్లక్ష్యం వంటి విషయాలను విశ్లేషించుకొని, చర్చించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.