Begin typing your search above and press return to search.

పెళ్లి వేదికైన సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్

By:  Tupaki Desk   |   22 May 2017 4:08 AM GMT
పెళ్లి వేదికైన సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్
X
రాజ‌కీయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు ఎలా ఉన్నా.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న వైఖ‌రి ప‌లువురిని ఆక‌ర్షిస్తుంది. త‌న‌ను న‌మ్ముకున్న వారి విష‌యంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవ‌టం.. కొన్ని సంద‌ర్భాల్లో వారిని నెత్తి పెట్టుకొని మ‌రీ చూసుకోవ‌టం క‌నిపిస్తుంది. త‌న ఇంట్లో ప‌ని చేసే ప‌ని కుర్రాడికి పెళ్లి చేయాల్సి వ‌స్తే.. మ‌మ అన్న‌ట్లుగా చేయ‌టం మామూలే. ఒక‌వేళ చేసినా.. చుట్టం చూపుగా వెళ్లి ఆశీర్వ‌దించి రావ‌టం గ‌తంలో ఎన్నోసార్లు చూసి ఉంటాం.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారిక నివాస‌మే పెళ్లి వేడుక‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మార‌టం.. కానీ..ముఖ్య‌మంత్రి కుమార్తె ద‌గ్గ‌ర ఉండి పెళ్లి ప‌నులు చూసుకోవ‌టం.. భోజ‌నాలు.. ఇత‌ర వేడుక‌ల్ని సీఎం దంప‌తులే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించ‌టం.. వ‌ధూవ‌రుల‌కు 12 తులాల బంగారం.. ఒక ఫ్లాట్‌ను ఇవ్వ‌టం లాంటివి చూసి ఉండ‌వేమో. ఇవ‌న్నీ చేసేశారు కేసీఆర్‌.
దాదాపు 12 ఏళ్ల నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంట్లో కొండేరు స‌తీశ్ ప‌ని చేస్తున్నాడు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా మ‌ణుగూరుకు చెందిన స‌తీశ్ ముఖ్య‌మంత్రి ఇంట్లో ప‌ని చేస్తున్నాడు. భోజ‌నం వ‌డ్డించ‌టం ద‌గ్గ‌ర నుంచి కేసీఆర్‌కు మందులు ఇవ్వ‌టం వ‌ర‌కూ అన్నీ తానై చూస్తుంటాడు. కేసీఆర్ వెంటే ఉంటాడు.

అలాంటి స‌తీశ్‌కు ఈ మ‌ధ్య‌నే పెళ్లి కుదిరింది. హైద‌రాబాద్ కు చెందిన శిరీష‌తో వివాహం నిశ్చ‌య‌మైంది. వీరి పెళ్లి వేడుక‌కు సీఎం క్యాంపు కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా మారింది. కేసీఆర్ దంప‌తులు పెళ్లి పెద్ద‌లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. ఏర్పాట్లు మొద‌లు.. కార్య‌క్ర‌మం మొత్తాన్ని తామే ద‌గ్గ‌రుండి జ‌రిపించారు. ఇక‌.. కేసీఆర్ కుమార్తె క‌విత సైతం పెళ్లి ప‌నుల్లో చురుగ్గా పాల్గొన‌టం గ‌మ‌నార్హం.

ఈ పెళ్లికి డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి.. ప‌లువురు మంత్రులు..ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి ఎస్పీ సింగ్ తో స‌హా.. ప‌లువురు ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. సింఫుల్ గా ఒక్క మాట‌లో చెప్పాలంటే.. కేసీఆర్ ఇంట్లో పెళ్లి జ‌రిగితే వ‌చ్చే వారిలో చాలామంది ఈ పెళ్లికి వ‌చ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటివి కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతాయని చెప్ప‌క త‌ప్ప‌దు.