Begin typing your search above and press return to search.

సీఎం ఫామ్ హౌస్.. ఫోకస్ అంతా దానిపైనే

By:  Tupaki Desk   |   18 Sep 2018 8:42 AM GMT
సీఎం ఫామ్ హౌస్.. ఫోకస్ అంతా దానిపైనే
X
సీఎం కేసీఆర్ ఒకనొక శుభముహూర్తాన తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి అందరికీ షాకిచ్చారు.. అధికారం కోల్పోయి ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయన ప్రభుత్వ పరంగా తనకు సంక్రమించే అధికారాలను వాడుకోకూడదని నిర్ణయించారు. అందుకే తాను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ప్రగతి భవన్ ను వదిలి.. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో గల తన ఫామ్ హౌస్ కు మకాం మార్చాడు. ప్రస్తుతం అక్కడే టికెట్ దక్కక అసమ్మతి రాజేస్తున్న నేతలను బుజ్జగించే పనిలో బిజీగా ఉన్నారు. అంతేకాదు ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి.. ఎలా ఓడించాలనే దానిపై రాజకీయ ప్రముఖులతో ఫామ్ హౌస్ లో ఉండే వ్యూహాత్మక చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు రావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయాలన్నీ ఇక్కడి నుంచే సాగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రకటించకుండా మిగిలిపోయిన సీట్లు, మార్చే సీట్లను ఆశిస్తున్న అభ్యర్థులందరూ ఇప్పుడు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు ఎవరినీ అంత తేలిగ్గా లోపలికి పంపించడం లేదట.. సందర్శకులు, ప్రజలను అనుమతించడం లేదట. లోపలి నుంచి సమాచారం ఉంటేనే అనుమతిస్తున్నారట.. ఫామ్ హౌస్ కు వచ్చే రహదారులన్నింటిని పోలీసులు దిగ్బంధించారు. వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేశాక మాత్రమే అనుమతిస్తున్నారట..

60 ఎకరాల ఫామ్ హౌస్ చుట్టుపక్కల రెండు వరుసల్లో గోడ పటిష్టంగా ఉంది. దానిపై ముళ్ల ఫెన్సింగ్ ఉంది. ముఖ్యమంత్రి భద్రత కోసం 24 గంటలు మధ్యలో ఏర్పాటు చేసిన టవర్ పైన పోలీసులు కాపాలా కాస్తున్నారు. ఇక ఫామ్ హౌస్ లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉండడంతో అధికార యంత్రాంగం ప్రస్తుతం రోజువారీ పరిపాలన వ్యవహారాల కోసం రోజూ ఫామ్ హౌస్ కు వచ్చివెళుతున్నారట..

ఇదివరకూ కేసీఆర్ ఫామ్ హౌస్ కు వస్తే సమీప గ్రామాల వారు తమ సమస్యలు చెప్పుకోవడానికి కేసీఆర్ వద్దకు వచ్చేవారు.ఇప్పుడు కూడా కేసీఆర్ వచ్చాడని వస్తున్నా పోలీసులు అనుమతించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు, రాజకీయ వేడి రాజుకోవడంతో ముఖ్యమంత్రి రోజూ వారీగా సమీక్షలు, బుజ్జిగింపులు ఎత్తులు పైఎత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో సామాన్యులు, సమీప గ్రామాల ప్రజలను ఆయన కలుసుకోవడం లేదట.. ఇలా ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి.