Begin typing your search above and press return to search.

ఢిల్లీ నుంచి రాగానే..కేబినెట్ ఎందుకు కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   27 Aug 2018 6:00 PM GMT
ఢిల్లీ నుంచి రాగానే..కేబినెట్ ఎందుకు కేసీఆర్‌?
X
వార్త‌ల్లో సంచ‌ల‌నానికి చిరునామాగా మారిపోయిన తెలంగాణ ముఖ్య‌మంత్రి మ‌రో కీల‌క వార్త‌తో అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకొన్నారు. అనూహ్య రీతిలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను తెర‌మీద‌కు తెచ్చిన కేసీఆర్ ఇందులో ట్విస్టుల ప‌రంప‌ర‌ను కొనసాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. కేసీఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ - కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ - నితిన్ గడ్కరీలతో భేటీ అయ్యారు. తెలంగాణ సమస్యలపై - రాష్ట్రానికి రావాల్సిన నిధులు - కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తదితర అంశాలను వెంటనే పరిష్కరించాలని వారిని కోరారు. అయితే, ఈ భేటీ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్ మ‌రింత ట్విస్ట్ ఇచ్చారు.

హ‌ఠాత్తుగా మంగ‌ళ‌వారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం అయ్యేందుకు అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అన్ని శాఖలు వెంటనే ప్రతిపాదనలు రెడీ చేసి ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తుంది. దీంతో కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాక‌ముందే ఆదేశాలు ఇవ్వ‌డంతో ఆఘ‌మేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే అసెంబ్లీ స్పీకర్ మధుసూనాచారి - సెక్రటరీ నర్సింహాచార్యులుతో అడ్వకేట్ జనరల్ శివానంద ప్రసాద్ భేటీ అయ్యారు. అసెంబ్లీ నిర్వహణ - న్యాయపరమైన అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ముందస్తు ఊహాగానాలతో రాష్ట్ర కేబినెట్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనుభ‌వాల‌ను, ముంద‌స్తును ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్ వెల్ల‌డిస్తార‌ని కొంద‌రు అంటుండ‌గా...కేవ‌లం అసెంబ్లీ స‌మావేశాల వ్యూహాల‌ను చ‌ర్చించేందుకే...ఈ సమావేశం జరగనుందని మ‌రికొంద‌రు చెప్తున్నారు. మొత్తంగా ఢిల్లీ వ‌చ్చిన త‌క్ష‌ణ‌మే ఈ ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం ఆస‌క్తిక‌రమే కాకుండా సంచ‌ల‌నంగా కూడా మారింది.