Begin typing your search above and press return to search.

కేసీఆర్‌...ఇంకోసారి నంబ‌ర్ వ‌న్ సీఎం

By:  Tupaki Desk   |   29 Oct 2016 4:07 AM GMT
కేసీఆర్‌...ఇంకోసారి నంబ‌ర్ వ‌న్ సీఎం
X
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ కు ఆ రాష్ట్ర ప్ర‌జానికం బ్రహ్మరథం పడుతున్నారని మ‌రో స‌ర్వే వెల్ల‌డించింది. అత్యుత్తమ పనితీరుగల ముఖ్యమంత్రిగా ప్రజలు కేసీఆర్‌ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌ రావు మరోమారు నంబర్‌ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 12 రాష్ట్రాల్లో నిర్వహించిన జాతీయస్థాయి సర్వేలో కేసీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. అత్యధికంగా 87 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలనకు తమ ఆమోదం తెలియజేశారు. ఆ తర్వాత స్థానాలను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్ (85%) - మమతాబెనర్జీ (79%) - జయలలిత (75%) కైవసం చేసుకున్నారు.

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సుమారు 51 శాతం ఓట్లు టీఆర్‌ ఎస్‌ కు లభిస్తాయని - రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌ సభ స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేస్తుందని సర్వేలో తేలింది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ కు 33.66% ఓట్లు లభించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 58 శాతం ప్రజల మద్దతుతో 8వ స్థానంలో నిలిచారు. దేశంలోని ఎన్నికలపై సర్వే నిర్వహించే వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పన్నెండు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది. సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ హవా కొనసాగుతున్నది. ప్రధానిగా ఆయనే సమర్థుడని 55 శాతం మంది ప్రజలు పేర్కొన్నారు. మరోవైపు.. త్వరలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీపార్టీ ప్రభంజనం సృష్టించనున్నదని సర్వే వెల్లడించింది.

దేశలో 17 లేదా అంతకంటే ఎక్కువ లోక్‌ సభ స్థానాలు కలిగిన పన్నెండు రాష్ట్రాల్లో (కేరళ మినహా) వివిధ అంశాలపై ఈ సర్వే జరిపారు. దీంట్లో భాగంగా 12,000 మందిని వివిధ అంశాలపై ప్రశ్నించారు. పన్నెండు రాష్ర్టాల్లోని సీఎంల పనితీరుపైనా, వారి ప్రజాదరణపైనా జరిపిన ఈ సర్వేలో అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రి కంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్లు తేలింది. మెజారిటీ ప్రజలు కేసీఆర్ పనితీరు - పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో లోక్‌ సభ లేదా అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 51 శాతం ఓట్లు టీఆర్‌ ఎస్‌ కు లభిస్తాయని, మొత్తం 17 లోక్‌ సభ స్థానాలూ ఆ పార్టీకి దక్కుతాయని సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో యూపీఏ భాగస్వామ్య పార్టీలకు 17 శాతం - ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు 15 శాతం ఓట్లు లభిస్తాయని తేలింది.

ఈ సంవత్సరం మే నెలలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా కేసీఆర్ నిలిచారు. నాడు కేసీఆర్‌కు 86 శాతం మంది ప్రజల మద్దతు లభించగా.. నేడు అది మరింత పెరిగి 87 శాతానికి చేరుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు అవుతున్న ప్రస్తుత సమయంలోనూ కేసీఆర్ ప్రజాదరణ తగ్గకపోగా మరింత పెరగటం విశేషం. మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబుకు గత సర్వేలో 69% మద్దతు లభించగా.. ప్రస్తుతసర్వేలో మద్దతు గణనీయంగా తగ్గిపోయి 58 శాతానికి పడిపోయింది. ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్‌ సభ ఎన్నికలు జరిగితే 15 స్థానాలను తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని - మిగిలిన 10 స్థానాలు వైసీపీ గెల్చుకుంటుందని సర్వే తేల్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/