Begin typing your search above and press return to search.

అవును.. కేసీఆర్ కోడ్ ఉల్లంఘించారు

By:  Tupaki Desk   |   12 Dec 2015 7:55 AM GMT
అవును.. కేసీఆర్ కోడ్ ఉల్లంఘించారు
X
వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల కమిషన్ తేల్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కల్యాణ లక్ష్మి పథకంపై చేసిన ప్రకటన నిబంధనల్ని ఉల్లంఘించినట్లేనని తేల్చింది. కల్యాణ లక్ష్మి పథకాన్ని బీసీలకు వర్తింపచేస్తామంటూ కేసీఆర్ ప్రకటించటాన్ని కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని అభిప్రాయపడింది.

ఇలాంటి ఉల్లంఘనలు మరోసారి చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ఈసీ పేర్కొంది. శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కేసీఆర్ కు అడ్వయిజరీ ఆర్డర్ ఇచ్చారు. అక్టోబరు 21న వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని.. అనంతరం అపన్నులకు క్రిస్మస్ వేడుకల సందర్భంగా వస్త్రాల పంపిణీ.. క్రిస్మస్ డిన్నర్.. ఎస్సీ.. ఎస్టీ.. బీసీ వర్గాల విద్యార్తులకు మెస్ ఛార్జీల రియింబర్స్ మెంట్.. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో వయోపరిమితి తగ్గించటం..కల్యాణ లక్ష్మీ పథకాన్ని బీసీలకు వర్తింపచేస్తామని చెప్పటం లాంటి ప్రకటనలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లేనని వివిధ రాకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.

ఈ అంశాలు పరిశీలించిన ఎన్నికల సంఘం.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కల్యాణ లక్ష్మి పథకంపై చేసిన ప్రకటన కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తేల్చారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.