Begin typing your search above and press return to search.

కేసీఆర్ మ‌రో అవార్డు కొట్టారే!

By:  Tupaki Desk   |   19 Aug 2017 10:33 AM GMT
కేసీఆర్ మ‌రో అవార్డు కొట్టారే!
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఘ‌న‌త దేశానికి తెలిసిపోయింది. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌నే కాకుండా రాజ‌కీయ దురంధ‌రుడిగా ఆయ‌న దేశంలోనే ఒక‌రిద్ద‌రు రాజ‌కీయ‌నేత‌ల వ‌రుస‌లో నిలిచారు. అయితే, ఆయ‌న‌లోని మ‌రోకోణం.. వ్య‌వ‌సాయం! ఆయ‌న‌కు మ‌ట్టివాస‌నంటే మ‌హా ఇష్టం. ప‌చ్చ‌ని పైరును చూడందే ఆయ‌న క్ష‌ణం ఉండ‌లేరు. అందుకే రాష్ట్రాన్ని వ్య‌వ‌సాయానికి కేంద్రంగా చేయాల‌ని త‌పించిపోతుంటారు. అంతేకాదు, ఆయ‌న త‌న‌కంటూ సొంతంగా ఓ వ్య‌వ‌సాయ క్షేత్రాన్నే ఏర్పాటు చేసుకున్నారు. ర‌క‌ర‌కాల పండ్లు, ఉద్యాన‌వ‌న పంట‌ల‌ను సైతం పండిస్తూ.. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటున్నారు కేసీఆర్‌.

ఇక‌, ఇప్పుడు ఆ నిత్య కృషీవ‌లునికి .. వ్య‌వ‌సాయానికి సంబంధించి అరుదైన గౌర‌వం ల‌భించింది. భారత ఆహార - వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ కేసీఆర్ ను ఈ అవార్డుకు ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం. సెప్టెంబరు 5వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ వ్యవసాయ నాయకత్వ సదస్సులో కేసీఆర్ కు భారత ఆహార - వ్యవసాయ మండలి ఈ అవార్డును అందజేయనుంది.

గ్రామీణాభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తులకు 2008 నుంచి భారత ఆహార - వ్యవసాయ మండలి ఈ అవార్డును అందజేస్తోంది. నిజంగా ఈ అవార్డు కేసీఆర్‌ కి రావ‌డం రాష్ట్రం మొత్తానికి వ‌చ్చిన‌ట్టేనన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవ‌ల ఆయ‌న ఓ జిల్లాలో నిర్వ‌హించిన స‌మావేశంలోనూ ప‌చ్చ‌ద‌నంపైనే మాట్లాడారు. ఇంటికి ఆరు మొక్క‌లు ఇస్తామ‌ని వాటిని బిడ్డ‌ల్లాగ సాకాల‌ని సీఎం సూచించారు. అంతేకాదు, మొక్క‌ల‌ను పెంచుతామ‌ని త‌న‌కు మాట ఇవ్వాల‌ని గ్ర‌మాస్తుల‌ను కోరారు. మొక్క‌ల‌ను మీరు పెంచండి.. మిమ్మ‌ల్ని నేను పెంచుతా! అన్నారు కేసీఆర్‌. దీనినిబ‌ట్టి ఆయ‌న మొక్క‌ల‌పై ప్రేమ‌ - ప‌చ్చ‌ద‌నంపై ఆప్యాయ‌త మ‌న‌కు అర్ధ‌మ‌వుతాయి!