Begin typing your search above and press return to search.

24 గంట‌ల్లో కౌంట‌ర్ ప్లాన్ రెడీ చేసిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   24 May 2017 4:33 AM GMT
24 గంట‌ల్లో కౌంట‌ర్ ప్లాన్ రెడీ చేసిన కేసీఆర్‌
X
ఎన్నిక‌ల వేళ ప్ర‌చారం చేయ‌టం.. హామీలు ఇవ్వ‌టం పాత మాట‌. ఇప్పుడు రాజ‌కీయం మారిపోయింది. ఎన్నిక‌ల‌కు రెండు మూడేళ్ల ముందే మేల్కొనే కొత్త త‌ర‌హా రాజ‌కీయాలకు మ‌న వారు శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ త‌ర‌హా వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న ఘ‌న‌త తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్షానికే చెందుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పర్య‌టిస్తున్న బీజేపీ బిగ్ బాస్ అమిత్ షా వ్యూహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ్యాప్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఎందుకంటే.. తాజాగా గులాబీ బాస్ ఇచ్చిన ఆదేశాల్ని చూస్తే.. ఇలాంటి భావ‌న క‌ల‌గ‌క‌మాన‌దు. మ‌రో రెండేళ్ల లో రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం మొద‌లు పెట్టేలా కేసీఆర్ ప్లానింగ్ చూస్తే.. అమిత్ షా వ్యూహానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.

ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్ర స‌ర్కారు చేసిన అభివృద్దిని రాష్ట్ర స‌మాచార‌.. ప్ర‌సార శాఖ‌లు మాత్ర‌మే చేసేవి. అందుకు భిన్నంగా ప్ర‌తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే స‌ర్కారు చేసిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలను నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఇంటికి చేరాల‌న్న ఆర్డ‌ర్‌ను కేసీఆర్ వేయ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాల్ని టీఆర్ఎస్ స‌ర్కారు అమ‌లు చేస్తుంద‌ని.. ఆ విష‌యాల్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని.. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లించాల‌ని కేసీఆర్ కోరుకుంటున్నారు.
ఇందుకోసం ప్ర‌త్యేకంగా నియోజ‌క‌వ‌ర్గ క‌మిటీల్ని ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీకి ఆయా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వ‌హిస్తారు. ఒక‌వేళ‌.. ఎమ్మెల్యేలు లేని చోట్ల ఎమ్మెల్సీలు బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని కేసీఆర్ చెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రో కీల‌క‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ క‌మిటీలో యువ‌త‌.. మ‌హిళ‌ల‌తో పాటు గిరిజ‌నులు.. మైనార్టీలు.. బీసీలు ఇలా అన్ని వ‌ర్గాలు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలన్న‌ది ఆయ‌న మాట‌గా చెబుతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కీల‌క‌మైన అన్ని వ‌ర్గాల్ని ఒక క‌ప్పు కింద‌కు తీసుకొచ్చేసి.. ప్ర‌తి ఇంటికి గులాబీ స‌ర్కారేం చేసింద‌న్న విష‌యం మీద ప్ర‌చారం చేయాల‌ని.. ప్ర‌భుత్వ ఫ‌లాలు అంద‌రికి వెళుతున్నాయో లేదో కూడా చెక్ చేయాల‌ని కేసీఆర్ ఆర్డ‌రేశారు. గ్రామ స్థాయి నుంచి మొద‌ల‌య్యే ఈ ప్ర‌చారంలో ప్ర‌జ‌లు ఏదైనా స‌మ‌స్య‌ను చెబితే.. వాటిని న‌మోదు చేసి మ‌రీ.. ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నించాల‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. గ్రామ‌స్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేయాల‌ని పే..ద్ద ఫార్ములాను తీసుకొచ్చిన అమిత్ షాకు చెక్ చెప్పేలా.. ఆయ‌న‌ ప్లాన్‌ను మ్యాప్ చేసిన‌ట్లుగా కేసీఆర్ తాజా దిశానిర్దేశం ఉండ‌టం గ‌మ‌నార్హం.