Begin typing your search above and press return to search.

దూరం పెంచితే ఏమౌతుంది కేసీఆర్ ? ఓవ‌ర్ టు త‌మిళ సై

By:  Tupaki Desk   |   12 April 2022 1:30 PM GMT
దూరం పెంచితే ఏమౌతుంది కేసీఆర్ ? ఓవ‌ర్ టు త‌మిళ సై
X
తెలంగాణ వాకిట ఇప్ప‌టికే అనేక ప‌రిణామాల్లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సైకు అవ‌మానాలు జరుగుతూనే ఉన్నాయి. ఆమె త‌న బాధ‌ను ప్ర‌ధాని మోడీ దృష్టికి తీసుకుని వెళ్లారు. హోం మంత్రి అమిత్ షాకు కూడా చెప్పారు. అయినా కూడా కేసీఆర్ లో మార్పు రావ‌డం లేదు అన్న‌ది ఆమె ఆవేద‌న. నిన్న‌టి వేళ భ‌ద్రాద్రి ప‌ర్య‌ట‌నే ఇందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ.

ఈ ప‌ర్య‌ట‌న‌లో కూడా ప్రొటొకాల్ పాటించ‌లేదు. మొన్న‌టి ఉగాది వేళ కూడా ఇదే విధంగా నియ‌మాల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించి కేసీఆర్ త‌న‌ను మ‌నో వేద‌న‌కు గురి చేశార‌ని గ‌వ‌ర్న‌ర్ క‌న్నీటి ప‌ర్యంతం అయిన సంగ‌తి విధిత‌మే! ఇంత‌కూ ఈ దూరం ఎందుకు? దీని వ‌ల్ల వ‌చ్చే ప‌రిణామాలు ఎలా ఉంటాయి?

వాస్త‌వానికి మొద‌ట్నుంచి కేసీఆర్ కు, బీజేపీకి మంచి సంబంధాలే ఉన్నాయి.ముఖ్యంగా రెండు పార్టీలూ స‌ఖ్య‌త‌తోనే వ్య‌వ‌హ‌రించాయి కూడా! ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ముందు నుంచి కేసీఆర్ కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు.ఇవే ఇప్పుడు త‌లనొప్పుల‌కు కారణం అవుతున్నాయి. ఆయ‌న దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయాల‌ని చూస్తున్నారు.

అదేవిధంగా థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కానీ లేదా జాతీయ స్థాయిలో కొత్త పార్టీ నెల‌కొల్పేందుకు కానీ స‌న్నాహాలు చేసి విఫ‌లం అయ్యారు కూడా! అస‌లు ఉప ప్రాంతీయ పార్టీలు ఢిల్లీ కేంద్రంగా ఎద‌గ‌డం క‌ష్ట‌మేన‌న్న విష‌యాన్ని కేసీఆర్ ఇవాళ అంగీక‌రించ‌డం లేదు. దీంతో త‌రుచూ ఏదో ఒక గొడ‌వ‌ను కేంద్రంతో పెట్టుకుంటున్నారు. యూపీఏకు ద‌గ్గ‌ర కావ‌డం కానీ లేదా సోనియా వ‌ర్గాల‌తో మాట్లాడి కొత్త ఫ్రంట్ ఏర్పాటుపై కానీ చ‌ర్చించ‌కుండా కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏమీ సాధించ‌లేరు అన్న‌ది సుస్ప‌ష్టం.

ఇదే విష‌యం ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కూడా స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ లేకుండా ఓ ప్ర‌త్యామ్నాయ కూట‌మి సాధ్యం కాద‌ని తేల్చేశారు. కానీ కేసీఆర్ కొన్ని కొన్ని త‌ప్పుడు నిర్ణ‌యాల కార‌ణంగా మమ‌తా బెన‌ర్జీ లాంటి నేత‌ల‌తో్ క‌లిసి ప్ర‌యాణించాల‌ని చూస్తున్నారు. కానీ ఇది కూడా వ‌ర్కౌట్ కాదు అని తేలిపోయింది.

ఏ విధంగా చూసుకున్నా ద‌క్షిణాది పార్టీల‌న్నీ కేసీఆర్ మాట విన్న రోజున అప్పుడు ఉత్తరాది శ‌క్తుల‌తో ఆయ‌న చేతులు క‌లిపినా ప్ర‌యోజ‌నం ఉంటుంది. కానీ ఇవేవీ సాధ్యం కాన‌ప్పుడు కేసీఆర్ చేసే నిర‌స‌న‌లు కేవ‌లం మీడియాకు వార్త‌లుగానే మిగిలిపోతాయ‌న్న‌ది విశ్లేష‌కుల మాట.