Begin typing your search above and press return to search.

స్టాలిన్ చేసిన ప‌నితో కేసీఆర్‌లో దూకుడు పెరుగుతుందా?

By:  Tupaki Desk   |   26 April 2022 9:30 AM GMT
స్టాలిన్ చేసిన ప‌నితో కేసీఆర్‌లో దూకుడు పెరుగుతుందా?
X
తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ను మించి అనేక మ‌లుపులు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విష‌యంలో దూకుడుగా స్పందించ‌డం, మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం విష‌యంలో ఎదురుదాడి చేయ‌డం.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లోపేతం అజెండాగా అధికార టీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతోంది.

ఈ క్ర‌మంలో కేసీఆర్ కు స‌న్నిహితుడుగా మారిన త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం కేసీఆర్ దూకుడుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంటున్నారు. యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవ‌డం గురించే ఇదంతా.

రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీలను ప్రభుత్వమే నియమించేలా చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో స్టాలిన్ ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ మేరకు తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి సోమవారం నాడు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అన్నాడీఎంకే, బీజేపీ వ్యతిరేకించగా.. పీఎంకే పార్టీ సమర్థించింది.

ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా అసెంబ్లీలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్ వైస్‌ ఛాన్సిలర్లను నియమించాలని.. అయితే అది తమ ప్రత్యేక హక్కు అన్నట్లుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రభుత్వాన్ని అగౌరవపర్చడమేకాక ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధమని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.

త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యంపై స్టాలిన్ వివ‌రణ ఇచ్చారు. వీసీల నియామకాల్లో ప్రభుత్వానికి అధికారం లేకపోవడం అనేది ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 2010లో మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మదన్ మోహన్ పూంఛీ నేతృత్వంలో కమిషన్‌కు ఇచ్చిన నివేదికను స్టాలిన్ ప్రస్తావించారు.

వీసీల నియామక ప్రక్రియ నుంచి గవర్నర్‌ను తొలగించాలని సదరు కమిటీ సిఫారసు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. కాగా, స్టాలిన్ తీసుకున్న నిర్ణ‌యం క‌నుక కేసీఆర్ ప‌రిశీలిస్తే, ఇప్ప‌టికే తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ - తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య గ్యాప్ మ‌రింత‌గా పెర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.