Begin typing your search above and press return to search.

రోజుల వ్యవధిలో ఎకరం రూ.2 కోట్లు కాస్తా రూ.5 కోట్లకు పైనే

By:  Tupaki Desk   |   6 May 2022 5:10 AM GMT
రోజుల వ్యవధిలో ఎకరం రూ.2 కోట్లు కాస్తా రూ.5 కోట్లకు పైనే
X
బలమైన రాజకీయ అధినేత చేతిలో అధికారం ఉండి.. రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలన్న దానిపై విజన్ ఉంటే చాలు.. కోట్లాది రూపాయిలు ఏ రీతిలో వచ్చి పడతాయన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జీవో 111 పరిధిలోని భూములపై బ్యాన్ సీలింగ్ ఎత్తేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి.

జీవో 111 ఎత్తేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం.. దానికి సంబంధించిన కసరత్తు జోరుగా సాగుతున్న వేళ.. ఆయా గ్రామాల్లోని భూముల ధరలు అమాంతం పెరిగిపోవటమే కాదు.. రియల్ ఎస్టేట్ బూమ్ భారీగా పెరిగిన పరిస్థితి. జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లోని భూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి.

జీవో111 పరిధిలో ఉన్న భూములకు అమితమైన డిమాండ్ నెలకొని ఉంటే.. పశ్చిమాన ఉన్న భూములకు డిమాండ్ తగ్గి.. లావాదేవీలు సైతం తగ్గినట్లుగా చెబుతుననారు. అంతేకాదు.. పశ్చిమ హైదరాబాద్ లో మొన్నటి వరకు భూముల కొనుగోళ్లతో పాటు.. ప్లాట్లు.. అపార్ట్ మెంట్లు భారీగా కొనుగోలు చేసే వారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా డిమాండ్ తగ్గిపోవటమే కాదు.. కొనుగోళ్లు మందగించినట్లుగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.

జీవో 111 ఎత్తివేత తర్వాత అక్కడ నిర్మాణాలపై ఎలాంటి మార్గదర్శకాలు ఉంటాయన్న దానిపై క్లారిటీ లేదు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను రూపొందించి.. అందులో గ్రీన్ జోన్.. రెసిడెన్షియల్ జోన్.. ఇండస్ట్రియల్ జోన్.. ఇలా ఏయే జోన్లు ఎక్కడెక్కడ అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ.. అంతకంతకూ పెరిగిపోతున్న ధరల పుణ్యమా అని.. కొందరు కొనుగోళ్ల మీద ఫోకస్ పెట్టారని చెప్పాలి. జీవో 111 ఎత్తివేత ప్రకటన సీఎం కేసీఆర్ నోటి నుంచి రావటానికి ముందు ఎకరం రూ.2 కోట్లు మాత్రమే పలికిన భూములు ఇప్పుడు అందుకు భిన్నంగా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకు పలుకుతున్నాయి. ఇదంతా చూసినప్పుడు కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాట పలువురికి కోట్లాది రూపాయిలు వచ్చేస్తున్న వైనం వాతావరణాన్ని ఖుషీగా మారుస్తుందని చెప్పక తప్పదు.