Begin typing your search above and press return to search.

జాతీయవాదం : కేసీయార్ లో ఎంత శాతం...?

By:  Tupaki Desk   |   15 Jun 2022 12:30 AM GMT
జాతీయవాదం : కేసీయార్ లో ఎంత శాతం...?
X
తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావానికి ఎంతో మంది కారకులు కానీ రాజకీయ నేతగా ఆ క్రెడిట్ మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే కేసీయార్ కి దక్కింది. ఆయన ఉద్యమాన్ని రాజకీయాన్ని మేళవించి సరైన ఎత్తుగడలతో తనదైన శైలిలో కేసీయార్ తెలంగాణాను తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. సరే రెండు సార్లు ఆయన అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి అయ్యారు.

ఇపుడు ఆయన చూపు దేశ రాజకీయాల మీద పడింది. మరి కెసీయార్ తెలంగాణా వాదం నుంచి జాతీయ వాదం వైపుగా అడుగులు వేస్తున్నారు. అయితే కేసీయార్ జాతీయ వాదం ఎంత శాతం అన్న చర్చ అయితే వస్తోంది. ఆయన ఉమ్మడి ఏపీని రెండుగా చేయడంతో కీలకపాత్ర పోషించారు. ఆంధ్రులే తనకు అసలైన శత్రువులు అన్నట్లుగా ఉద్యమ కాలంలో వ్యవహరించారు. ఆ తరువాత చూసుకున్నా తెలంగాణాలో ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా నూటికి తొంబై శాతం తెలంగాణా వారికే అని నిబంధన పెట్టారు. దేశంలో ఎక్కడా లేని లోకల్ నినాదం ఇది.

అలా కేసీయార్ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా కంటే కూడా ఒక పక్కా లోకల్ లీడర్ గానే తన రాజకీయాల్లో విజయాలు సాధించారు. ఎనిమిదేళ్ళ క్రితం అడ్డగోలు విభజనకు గురి అయిన ఏపీ ఈ రోజుకీ దాని పాపాలూ శాపాలు అనుభవిస్తోంది. ఇక సాటి తెలుగు వారిని కలుపుకుని ముందుకు అడుగులు వేయలేని కేసీయార్ రేపటి రోజున దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల ప్రజలకు ఎలా కలుపుకుని ముందుకు పోగలరు అన్న ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది.

కేసీయార్ వరకూ చూస్తే ఆయన రాజకీయం అంతా ఉద్యమంతో ముడిపడిపోయింది. ఇపుడు ఆయన భారత దేశం కావాలని అంటున్నారు. తన పార్టీ అంతటా విస్తరించాలని కోరుకుంటున్నారు. ఆ సమయంలో కచ్చితంగా ఏపీ వైపు కూడా చూడాల్సి ఉంటుంది.

మరి ఏపీలో ఎంతవరకూ కేసీయార్ కి మద్దతు లభిస్తుంది అన్నది కూడా చర్చగానే చూడాలి. అదే విధంగా అడ్డగోలు విభజన చేసింది అని కాంగ్రెస్ నే ఈ రోజుకీ క్షమించలేని విధంగా ఆంధ్రుల కోపం ఉంది. మరి దానికి అసలైన కారణమైన టీయారెస్ ని దాని అధినేతను ఎలా క్షమించగలదు అన్నది చాలా పెద్ద ప్రశ్నగా ఉంది.

ఇక కేసీయార్ ని జాతీయ నాయకుడిగా ఎంతవరకూ ఇతర ప్రాంతాల వారు అంగీకరిస్తారు అన్నది కూడా పెద్ద డౌట్. కేసీయార్ ఎనిమిదేళ్ళ ముఖ్యమంత్రి మాత్రమే. ఆ విధంగా చూస్తే మమతా బెనర్జీ సీనియర్ గా ఉన్నారు. ఆమె ఏనాటికైనా ప్రధాని పీఠం పట్టాలని చూస్తున్నారు. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తో పాటు బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పోటీ పడుతున్నాయి. ఇక్కడ కేసీయార్ పార్టీకి చోటు ఉంటుందా అంటే జవాబు కష్టమే.

ఇక ఉత్తరాదిన చాలా చోట్ల కాంగ్రెస్, బీజేపీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా పెద్దన్న పాత్రకే రెడీగా ఉన్నారు. అందువల్ల కేసీయార్ భారత రాష్ట్ర సమితి అన్నది ఆచరణలో వర్కౌట్ అయ్యేనా అన్న డౌట్లు చాలా ఉన్నాయి. ఏది ఏమైనా కేసీయార్ ఒక వ్యూహం ప్రకారం తెలంగాణాలో తన పార్టీని మూడవ సారి గెలిపించుకునేందుకు మాత్రమే జాతీయ రాజకీయాలు అంటూ హడావుడి చేస్తున్నారు అని ప్రత్యర్ధులు అంటున్న దాంటో తప్పు లేదన్న మాట అయితే వినిపిస్తోంది.