Begin typing your search above and press return to search.

కేసీఆర్ లో మిస్ అయిన ఉద్యమనేత.. గులాబీకి కొత్త గండం?

By:  Tupaki Desk   |   3 July 2022 4:08 AM GMT
కేసీఆర్ లో మిస్ అయిన ఉద్యమనేత.. గులాబీకి కొత్త గండం?
X
తాను ఎవరినైనా టార్గెట్ చేయటానికి ముందు.. భారీగా కసరత్తులు చేసే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కువ. ఆయన గురించి బాగా తెలిసిన వారు ఒక విషయాన్ని తరచూ చెబుతుంటారు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ పాత్రను ఉద్దేశించి ఎంఎస్ నారాయణ.. 'ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు' అన్న మాటల్ని తూచా తప్పకుండా ఇంతకాలం ఫాలో అయిన కేసీఆర్.. తొలిసారి తన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న మాట గులాబీ నేతల నేతల నోటి నుంచి ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తుండటం గమనార్హం.

తెలంగాణ ఉద్యమంలో ఎంత దూకుడుగా వ్యవహరించినప్పటికీ.. తెలంగాణ సాధనే అంతిమ లక్ష్యమే తప్పించి.. దాని కోసం దేనికోసమైనా.. ఎలాంటి రాజీకైనా సిద్ధమన్న సంకేతాల్ని తరచూ ఇచ్చేవారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా కేసీఆర్ శైలి ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. 'ఆయనలో అప్పటి ఉద్యమ నేత ఇప్పుడు లేరు. ఇప్పుడున్నదంతా సంపూర్ణ రాజకీయ నేత మాత్రమే. కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు. అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. అదే ఇప్పుడు కొత్త సమస్యలకు కారణమైంది' అన్న ఒక సీనియర్ నేత మాట విన్నప్పుడు.. మారిన కేసీఆర్ తీరు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందని చెప్పాలి.

ఢిల్లీ పీఠం మీద మొదలైన కొత్త ఆశ కూడా కేసీఆర్ కు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టటం ఖాయమంటున్నారు. తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పక్షంలో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటంతో పాటు.. తనకు ఎలాంటి పదవులు ఇవ్వకున్నా ఫర్లేదన్న మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చేదని గుర్తు చేస్తున్నారు. కాలం కలిసి రావటం.. విలీనానికి కేసీఆర్ సిద్ధమైన సమయంలో.. కాంగ్రెస్ అధినేత్రికి వెళ్లిన రాంగ్ ఫీడ్ బ్యాక్ ను అడ్వాంటేజీగా చేసుకున్న కేసీఆర్.. తనలోని రాజకీయ నేతను బయటకు తీసుకురావటం.. కట్ చేస్తే.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనేమనుకున్నారో అదే జరిగిందన్న మాట వినిపిస్తోంది.

గెలుపు ఇంటి అడ్రస్ గా మారినప్పుడు ఆత్మవిశ్వాసం అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం కేసీఆర్ మానసిక పరిస్థితి కూడా ఇలానే ఉందన్న వాదన వినిపిస్తోంది. భావోద్వేగ రాజకీయాలతో పాటు.. తన మాదిరి దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి లేరని.. తన సామర్థ్యానికి.. సమర్థతకు ముఖ్యమంత్రి పదవి చిన్నదన్న ఆలోచనలు ఈ మధ్యన కేసీఆర్ మాటల్లో వినిపిస్తున్న తీరు చూస్తే.. ఆయన టార్గెట్ మారిందంటున్నారు. అదే.. మోడీతో ప్రత్యక్ష యుద్ధానికి కారణమంటున్నారు. ఉద్యమనేతగా ఉన్నంత కాలం తన సమర్థత మీద నమ్మకం ఉన్నప్పటికీ.. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉండేది కాదని.. ఇప్పుడు మాత్రం అది ఎక్కువైందని.. అదే గులాబీ పార్టీకి కొత్త గండం కానుందన్న మాట వినిపిస్తోంది. అదెంత వరకు నిజమన్నది కాలమే బదులివ్వాలి.