Begin typing your search above and press return to search.

ఉన్నట్లుండి కేసీఆర్ కు ‘దమ్ము’ ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది?

By:  Tupaki Desk   |   11 July 2022 9:40 AM GMT
ఉన్నట్లుండి కేసీఆర్ కు ‘దమ్ము’ ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది?
X
సవాలు విసిరే పెద్ద మనిషికి.. తనను ఉద్దేశించి ఎవరైనా సవాలు విసిరినప్పుడు కూడా స్పందించాలి కదా? అందుకు భిన్నంగా తనకు మూడ్ వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి.. తనకు తోచింది మాట్లాడేసి.. తాను అనుకున్నట్లుగా సవాళ్లు విసిరేసే వైనం చూసినప్పుడు.. ఇలాంటి విన్యాసాలు కేసీఆర్ కు మాత్రమే సాధ్యమనుకోకుండా ఉండలేం. ఆదివారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టేసి.. ప్రధాని నరేంద్ర మోడీ మీదా.. బీజేపీని ఉద్దేశించి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన ఆయన.. పనిలో పనిగా తనకున్న దమ్మును కూడా ప్రదర్శించే ప్రయత్నం చేశారు.

బీజేపీ వాళ్లకు నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించమని సవాలు విసిరారు. నిజంగానే వారు ఎన్నికల తేదీని ప్రకటిస్తే.. తాను కూడా అసెంబ్లీని రద్దు చేస్తామని.. అందరం ఎన్నికలకు పోదామని ఆయన బస్తీమే సవాల్ అన్న రీతిలో మాటగ్లాడారు. చిల్లర మాటలతో కేసీఆర్ ను కొడతారా? దెబ్బ తీస్తారా? ఇంత కురచ ఆలోచనా? ఇది మంచిది కాదు. ఒకవేళ ముందస్తుకు పోతే కేసీఆర్ ను తట్టుకుంటారా? అంటూ తనను తాను పొగుడుకోవటమే కాదు.. ప్రత్యర్థిని తిట్టేశారు.

మిగిలిన పార్టీ అధినేతలకు కేసీఆర్ కు ఉన్న వ్యత్యాసం ఏమంటే.. అందరూ తమ ప్రత్యర్థుల్ని తిట్టి పోస్తారు. కేసీఆర్ మాత్రం.. ఆ పనితో పాటు తన గొప్పతనాన్ని.. తన వీరత్వాన్ని కూడా అదేపనిగా చెప్పుకుంటారు. ఎవరో తన ఇమేజ్ ను పెంచటం కాదు.. తనకు తానే ఆ పని చేసుకోవటం ఆయనకు మాత్రమే చేతనయ్యే విద్యగా చెప్పాలి. తాను జాతీయస్థాయి రాజకీయాల్లోకి వస్తే రైతుబంధు.. దళిత బంధు ఇస్తానని చెబితే.. తమ కొంప మునుగుతుందని బీజేపీ భయపడుతోందన్న మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చింది.

ఇప్పటికిప్పుడు తెలంగాణలో రైతుబంధును మాత్రమే అమలవుతుందే తప్పించి.. ఆయన చెబుతున్నట్లుగా దళత బంధు అమలు కావట్లేదు. అలా అని ఆపేశారని చెప్పటం కూడా మా ఉద్దేశం కాదు. ముందుగా చెప్పినట్లుగా.. దళిత బంధును వేగిరం అమలు చేయకుండా నెమ్మది చేశారు. కాలం గడిచే కొద్దీ.. దళిత బంధు అసలు కత బయటకు రావటమే కాదు.. దాని అమలు కారణంగా చోటు చేసుకునే పరిణామాలు ఏ రీతిలో ఉంటాయన్న విషయంపై మరింత అవగాహన రావటం ఖాయం.

ఇప్పటికే డబ్బుల్ని పప్పుబెల్లాల మాదిరి పంచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పుణ్యమా అని.. మౌలిక రంగ వసతుల విషయంలో అంతకంతకూ వెనుక పడిపోతున్న పరిస్థితి. అందుకు హైదరాబాద్ లోని రోడ్లు.. ట్రాఫిక్ జాంలే నిదర్శనంగా చెప్పాలి. నిజానికి వేలాది కోట్లు ఖర్చు చేసి రైతుబంధు.. దళిత బంధు అమలు చేసే బదులు.. రైతులకు నాణ్యమైన విత్తనాలు.. ఎరువులు.. పురుగుమందుల్ని ఉచితంగా పంపిణీ చేయటం.. దళితులు.. ఇతర వెనుకబడిన వర్గాలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తే మెరుగ్గా ఉంటుంది. అది వదిలేసి.. డబ్బుల్ని పంచేయటం వల్ల వచ్చే ఉపయోగం ఎంతన్నది ప్రశ్నే.

ముందస్తు విషయంలో దమ్ము మాటలు చెప్పిన కేసీఆర్ తీరు చూస్తే.. తాను అన్నింటికి సిద్ధంగా ఉన్నానన్న విషయం ఆయన మాటలు చెప్పేస్తున్నాయి. రాజకీయాల్లో తెలివైన వారు ఎవరైనా సరే.. ప్రత్యర్థి సిద్ధంగా ఉన్నప్పుడు పోరుకు సిద్ధం కారు కదా? అలాంటప్పుడు కేసీఆర్ లాంటి నేత నోటి నుంచి దమ్ము మాటలు ఎన్ని వచ్చినా.. అందుకు స్పందన ఏమీ ఉండదన్నది మర్చిపోకూడదు. నిజానికి కేసీఆర్ కు కూడా అదే కావాలి. కానీ.. నిజంగానే ఆయనకు దమ్ము ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో వివిధ వర్గాలు విసిరే సవాళ్లకు స్పందిస్తే మాత్రం.. గులాబీ బాస్ ను నిజంగానే దమ్మున్నోడిగా గుర్తించకతప్పదు.