Begin typing your search above and press return to search.

న్యాయం బతికే ఉంది.. కేసీఆర్ కు జగన్ కు అదే తేడానట!

By:  Tupaki Desk   |   11 July 2022 11:30 AM GMT
న్యాయం బతికే ఉంది.. కేసీఆర్ కు జగన్ కు అదే తేడానట!
X
మహారాజుకు.. యువరాజుకు తేడా స్పష్టం. అందునా ప్రజాస్వామ్య భారతంలో కింద నుంచి ఎదిగిన అధినేతకు.. ఆ తరహా అధినేతకు పుట్టిన యువరాజుకు తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.. అధికార పార్టీ అధినేతల్ని చూసినప్పుడు ఈ విషయం స్పష్టమవుతుంది. కింది నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అనూహ్యంగా సీఎం కుర్చీలో కూర్చున్న కేసీఆర్ కు.. అలా ఎదిగి తిరుగులేని నేతగా మారిన దివంగత నేత వైఎస్ కుమారుడన్న హోదాలో సీఎం కుర్చీలో కూర్చున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా చాలానే కనిపిస్తుంటుంది. తమ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కేసీఆర్ కు.. జగన్ కు ఎక్కడా పోలిక కనిపించదు.

జగన్ లోని దూకుడులో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంటుంది. అదే సమయంలో సీఎం కేసీఆర్ ను చూసినప్పుడు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. బ్యాకప్ పెట్టుకొని ఫైట్ చేయటం కనిపిస్తుంది. తాజాగా దేశంలోని అతి కొద్ది మంది అధినేతలు మాత్రమే టార్గెట్ చేసే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తాజాగా కేసీఆర్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ఆ మాటకు వస్తే.. టీఎంసీ అధినేత్రి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం తన రాష్ట్ర పీఠం కోసం మాత్రమే మోడీతో లొల్లి పెట్టుకున్నారే తప్పించి.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. మోడీ సంగతి చూడాలన్నట్లుగా మాట్లాడింది కనిపించదు.

కానీ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నం. కొడితే కుంభ స్థలం కొట్టాలన్నట్లుగా ఆయన తీరు ఉంది. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన వేళలో ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆవేశంతో ఉన్నట్లు అనిపించినా.. దాని వెనుక చాలానే కసరత్తు కొట్టొచ్చినట్లు కనిపించకమానదు. కేంద్రంలో లొల్లి పెట్టుకునే ముఖ్యమంత్రులకు కేసులు.. జైళ్లు బహుమతులుగా అందుతున్నట్లుగా ఆరోపణలు ఉన్న వేళ.. అదే అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. జైళ్లకు.. కేసులకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు.

తన మీదా ఒకట్రెండు కేసులు పెడతారేమో? అన్న సందేహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఆ వెంటనే తన వైపు న్యాయం ఉందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ.. 'న్యాయం బతికే ఉంది' అన్న మాటలను చూసినప్పుడు.. ఎప్పుడు ఎవరితో పెట్టుకోవాలో.. ఎవరితో పెట్టుకోకూడదన్న విషయంలో క్లారిటీ ఉందన్న విషయం స్పష్టమవుతుంది. తమ పార్టీలో ఈడీ కేసులు పెట్టేంత దొంగలు లేరన్న కేసీఆర్ మాటలకు రానున్న రోజులు ఎలా ఉంటాయన్నది సందేహం కలుగక మానదు.

మోడీ మీద యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్.. అదే సమయంలో మిగిలిన వ్యవస్థలను దూరం చేసుకోని రీతిలో వ్యవహరిస్తూ.. ఆయా వ్యవస్థల మీద తనకు నమ్మకం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారని చెప్పాలి. ఒకవేళ ఇలాంటి పరిస్థితే జగన్ కు ఎదురై.. ఆయన ఎవరి మీద అయినా పోరు చేసే క్రమంలో.. పోరు మీదనే ఫోకస్ పెట్టి.. ఎవరిని పడితే వారిని ఒక మాట అనేసేందుకు వెనుకాడనట్లుగా ఆయన చేతలు ఉంటాయని చెప్పక తప్పదు. కేసీఆర్ ఫైటింగ్ లో దూకుడుతో పాటు లౌక్యం ఉంటుంది. జగన్ లో మాత్రం అది మిస్ అవుతుంటుందన్న భావన కలుగుతుంటుంది.