Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్-నాదెండ్ల పోలిక తెచ్చిన కేసీఆర్.. తప్పులో కాలేశారట

By:  Tupaki Desk   |   11 July 2022 11:30 AM GMT
ఎన్టీఆర్-నాదెండ్ల పోలిక తెచ్చిన కేసీఆర్.. తప్పులో కాలేశారట
X
ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉండటంతో పాటు.. బోలెడన్ని పుస్తకాలు చదవటం.. మెదడులో కాస్తంత గుజ్జు ఉన్న వారిని ఇట్టే గుర్తించేసి.. వారితో కలిసి మాట కలపటం.. పలు అంశాల మీద పెద్ద ఎత్తున చర్చలు జరపటం లాంటివి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చేస్తుంటారు. అందుకే ఆయన మాటల్లో కమాండ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇటీవల ఆయన మాటల్లో కొంత గ్యాప్ రావటంతో పాటు.. ఇట్టే కుదురుకునే మాదిరి పోలికల్ని చెప్పే విషయంలో వెనుకపడి పోతున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏక్ నాథ్ షిండేను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తన జాతీయ రాజకీయ జర్నీలో శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే తనకు తోడుగా ఉంటాడనుకుంటే.. ఆయన ఉనికే ఇప్పుడు ప్రమాదంలో పడిన పరిస్థితి. ఇలాంటి వేళ.. తన లోపలి అసహనాన్ని బయటకు వెల్లడించే క్రమంలో అతకని పోలిక ఒకటి చెప్పిన వైనం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఏక్ నాథ్ షిండేను నాదెండ్ల భాస్కర్ రావుతో పోలుస్తూ.. ఉద్దవ్ ఠాక్రేను ఎన్టీఆర్ తో పోల్చటం.. కేంద్రంలోని మోడీ సర్కారును అప్పటి ఇందిర సర్కారుతో పోల్చిన వైనాన్ని చూసినప్పుడు కేసీఆర్ తప్పులో కాలేయటం ఇట్టే కనిపిస్తోంది. ఎన్టీఆర్ ను దించేసి.. ఆయన స్థానంలో నాదెండ్లను గద్దెను ఎక్కించిన మరుక్షణం నుంచి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున రగిలిపోయింది. ప్రజలే స్వయంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు.. ఆందోళనలు చేపట్టారు.

తామెంతో అభిమానించే అధినేతకు ఇంత అన్యాయం చేస్తారా? అంటూ ప్రజలే రగిలిపోయిన పరిస్థితి. అంతేనా.. ఒక్కో రోజు గడిచే కొద్దీ నాటి ఉమ్మడి ఏపీ మొత్తం ఆందోళనల బాట పట్టటమే కాదు.. నాదెండ్ల ప్రభుత్వాన్ని తమ నిరసనలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేకుండానే ప్రజలు స్వచ్చందంగా కేంద్రంపై విరుచుకుపడిన పరిస్థితి. అలాంటివన్నీ నాటి ఏపీలో చోటు చేసుకుంటే.. నిజంగానే ఏక్ నాథ్ షిండే సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా నాదెండ్ల భాస్కర్ రావు అయి ఉంటే ఈపాటికి మహారాష్ట్రలో ఆందోళనలు పెద్ద ఎత్తున షురూ కావాల్సింది. అలాంటిదేమీ జరగలేదంటే.. ఉద్దవ్ సర్కారు మీద మరాఠీ ప్రజల్లో కోపం ఉన్నట్లే.

ఇదంతా చూసినప్పుడు సీఎం కేసీఆర్ పోల్చిన పోలిక ఏ మాత్రం నప్పక పోవటమే కాదు.. మరాఠీ ప్రజల మనసుల్ని తెలుసుకునే విషయంలో తప్పుగా మాట్లాడారా? అన్న భావన కలుగక తప్పదు. తన గురించి.. తన ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పే విషయంలో కాస్త ఎక్కువగా చెప్పుకున్నా ఫర్లేదు. కానీ.. జరిగిపోయిన చరిత్రను.. జరుగుతున్న వర్తమానాన్ని ప్రస్తావించే సమయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలి. కానీ.. ఆ విషయంలో కేసీఆర్ ఎందుకు పొరపడుతున్నారన్నది ప్రశ్న. ఇకనుంచైనా పోలికలు పోల్చే వేళలో.. మరింత అప్రమత్తత అవసరం. ఆ విషయాన్ని గులాబీ బాస్ కు అర్థమయ్యేలా ఎవరైనా చెబితే బాగుండు.