Begin typing your search above and press return to search.

ఎన్నికల ఎజెండాను తెర మీదకు తెచ్చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   17 July 2022 3:30 PM GMT
ఎన్నికల ఎజెండాను తెర మీదకు తెచ్చేసిన కేసీఆర్
X
భావోద్వేగం ఆయన ఆయుధం. సెంటిమెంట్ ఆయన బలం. ఈ రెండింటిని ఆయుధాలుగా చేసుకొని రాజకీయ రంగంలోకి దూసుకెళ్లటమే కాదు.. ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థులపై కసిగా వాడేసే అలవాటున్న అధినేతగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చెప్పాలి. ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటున్న ఆయన.. మరో దశాబ్దానికి పైనే తెలంగాణకు తానే సీఎం అన్న ధీమా ఆయన మాటల్లో వినిపిస్తుంటుంది. 2018 నాటి ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి పరిస్థితి మరింత గడ్డుగా తయారవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నవేళ.. అలాంటివి అంత తేలికైన విషయం కాదన్న మాట గులాబీ నేతల్లో వినిపిస్తుంటుంది.

అదెలా అన్న దానికి బదులుగా తాజాగా సీఎం కేసీఆర్ మాటలే నిదర్శనంగా చెబుతున్నారు. 2018 ఎన్నికల వేళ ఆంధ్రా బూచి.. చంద్రబాబు పేరుతో సెంటిమెంట్ రగిలించి.. తెలంగాణ ప్రజల్ని ఒకే తాటి మీదకు తీసుకొచ్చి.. తాను కోరుకున్న ఎన్నికల ఫలితాల్ని తెచ్చుకున్న గులాబీ బాస్.. ఇప్పుడు కాస్తంత యాంగిల్ మార్చిన వైనం తెలిసిందే. ఇప్పుడు ప్రధాన మంత్రి మోడీని లక్ష్యంగా చేసుకున్న కేసీఆర్.. తన ఎన్నికల వ్యూహాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే కేంద్రం తెలంగాణను పట్టించుకోవటం లేదన్న ఆయన.. ఇప్పుడు తెలంగాణను చూసి మోడీ కన్ను కుట్టిందన్న కీలక వ్యాఖ్య చేయటం గమనార్హం.

కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే.. ''అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోదీకి కన్ను కుట్టింది. నిబంధనల పేరుతో ఆర్థికంగా అణచివేయాలని చూస్తున్నారు. తెలంగాణపై కేంద్రం కక్షపూరిత వైఖరిని అనుసరిస్తోంది. దీనిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో గళం విప్పండి'' అంటూ దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో.. సందర్భానికి తగ్గట్లు మోడీ సర్కారుపై పోరు చేసే పార్టీ ఎంపీలతో కలిసి ముందుకు నడవాలని ఆయన పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో మాదిరి ఏపీని.. చంద్రబాబును బూచిగా చూపించి వెళ్లే అవకాశం లేనందున.. ఈసారి మోడీ పేరుతో ఎన్నికలకు వెళ్లాలన్న ఆయన వ్యూహానికి పదును పెడుతున్న వైనం తాజాగా ఆయన మాటల్ని చూస్తే అర్తమవుతుందని చెప్పాలి. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయని.. పరిమితులకు లోబడే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతోందన్నారు. ఆర్ బీఐ ఆధ్వర్యంలో జరిగే బిడ్ల వేలంలో తెలంగాణ బిడ్లకే ఎక్కువ డిమాండ్ పలుకుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్న కేసీఆర్.. అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అడ్డు పడుతుందని మండిపడుతున్నారు. అంతా బాగుంది.. దూసుకెళుతున్నామని చెప్పే కేసీఆర్.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మాదిరి అప్పులు లేని తెలంగాణ రాష్ట్రంగా మార్చాలన్న ఆలోచనలో ఎందుకు ముందుకు వెళ్లరు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు ఏ రీతిలో రియాక్టు కావాలన్న వ్యూహాన్ని చెప్పే క్రమంలోనూ రాబోయే ఎన్నికల వ్యూహానికి తగ్గట్లు మాట్లాడటం గమనార్హం.