Begin typing your search above and press return to search.

గోదావ‌రి వ‌ర‌ద‌ల వెనుక భారీ కుట్ర‌: కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   17 July 2022 8:30 AM GMT
గోదావ‌రి వ‌ర‌ద‌ల వెనుక భారీ కుట్ర‌:  కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గోదావ‌రి వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన ప్రాంతా ల్లో ప‌ర్య‌టించిన ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. గోదావ‌రి వ‌ర‌ద‌ల వెనుక భారీ కుట్ర‌లు ఉన్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫ్ల‌డ్ బ‌ర‌స్ట్ అనే కాన్సెప్టుతో తెలంగాణ‌ను ముంచేసే కుట్ర జ‌రుగుతోంద‌ని తెలి పారు. విదేశాల్లో క్లౌడ్ బ‌రస్ట్ అనే కుట్ర‌లు ఉన్నాయ‌ని చెప్పిన కేసీఆర్‌.. మ‌న ద‌గ్గర ఫ్ల‌డ్ బ‌ర‌స్టులు జ‌రుగుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఇది కొత్త ప‌ద్ధ‌త‌ని, దీని వెనుక కుట్ర‌లు ఉన్నాయ‌ని చెప్పారు.

గ‌తంలో లేహ్‌, ఉత్త‌రాఖండ్ ప్రాంతాల్లో క్లౌడ్ బ‌ర‌స్ట్‌లు జ‌రిగాయ‌నే ప్ర‌చారం ఉంద‌ని కేసీఆర్ చెప్పారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సంభ‌వించిన వ‌ర‌ద‌ల వెనుక కూడా కుట్ర‌లు ఉన్నాయయ‌ని.. ఇవి బ‌య‌ట‌కు రావాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తొలుత గోదావరి కరకట్టను పరిశీలించిన సీఎం కేసీఆర్.. వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత భద్రాచలంలో పునరావాస కేంద్రాన్ని సీఎం పరిశీలించారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

వరద బాధితులకు తక్షణమే రూ.10 వేలు ఆర్థికసాయం, 20 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాల‌ని ఆదేశించారు. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణహాని జరగలేదన్నారు. రెండు జిల్లాల యంత్రాంగం ప్రాణ నష్టం జరగకుండా చూసింద‌ని తెలిపారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం జరగాలన్నారు. కడెం ప్రాజెక్టు వద్ద ఊహించనంత వరద వచ్చిందని, వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారని తెలిపారు. మొత్తం 7,274 కుటుంబాలను అధికారులు తరలించారని తెలిపారు. వాతావరణశాఖ ప్రకారం ఈ నెల 29 వరకు వర్షాలు ఉంటాయ‌న్నారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.10 వేలు ఆర్థిక సాయం, బాధిత కుటుంబాలకు 20 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసిన‌ట్టు సీఎం తెలిపారు.