Begin typing your search above and press return to search.

తోపు కేసీఆర్ నోటి నుంచి ఇలాంటి బేల మాటలా?

By:  Tupaki Desk   |   21 Aug 2022 5:05 AM GMT
తోపు కేసీఆర్ నోటి నుంచి ఇలాంటి బేల మాటలా?
X
గులాబీ బాస్ కేసీఆర్ అంటే మామూలు విషయం కాదు. ఆయన నోటి నుంచి వచ్చే మాటలు తూటాల మాదిరి ఉంటాయన్నది తెలిసిందే. తాను టార్గెట్ చేసిన ప్రత్యర్థి పార్టీల ఒక రేంజ్లో విరుచుకుపడటమే కాదు.. వారిపై ప్రజల్ని ఉసిగొల్పేలా ఆయన వాదనలకున్న శక్తి ఎలాంటిదన్న విషయం తెలిసిందే. తాను జత కట్టిన పార్టీల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ పార్టీలను ఉద్దేశించి ఆయన ఎంతలా తిట్టిపోస్తారో గుర్తు చేయాల్సిన అవసరంలేదు. కేసీఆర్ రాజకీయ ప్రయాణాన్ని చూసినప్పుడు.. ఎప్పుడైనా ఆయన సమరానికి సదా సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తారే తప్పించి.. ఆయన మాటల్లో బేలతనం అన్నది అస్సలు కనిపించదు. వినిపించదు కూడా.

ప్రత్యర్థులపై నిప్పులు చెరగటం.. ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం ఆయనకు అలవాటు. అలాంటి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యలు కాసింత విస్మయానికి గురి చేశాయని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఉప ఎన్నికల్ని ఎదుర్కోవటం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఉప ఎన్నికల సందర్భంగా సెంటిమెంట్ ను రగల్చటం.. తన వాదనతో కన్విన్స్ చేయటం.. వారంతా భావోద్వేగంతో ఊగిపోయేలా చేసి.. ఆ జట్టుకు నాయకత్వం వహించి.. విజయ తీరాల దిశగా అడుగులు వేయాలన్నట్లుగా కేసీఆర్ మాటలు ఉంటాయి.

అందుకు భిన్నంగా తాజాగా ముగిసిన మునుగోడు బహిరంగ సభలో మోడీ సర్కారు మీద నిప్పులు చెరిగిన ఆయన.. అక్కడి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన మాటల్లో కేసీఆర్ బేలతనం కొట్టొచ్చినట్లుగా కనపించడం గమనార్హం. మీరు ఓట్లు వేయకపోతే.. మోడీ సర్కారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారని.. రైతాంగం జాగ్రత్తలు పడాలని పదే పదే ప్రస్తావించటం చూస్తే..రైతుల్లో మోడీ మీద వ్యతిరేకత పెంచటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.

అంతేకాదు.. మోడీ లాంటి పవర్ ఫుల్ నేతను ఎదుర్కొనేందుకు తాను చేస్తున్న యుద్ధానికి దన్నుగా నిలవాలన్న వేడికోలు ఆయన మాటల్లో కనిపించడం గమనార్హం. నిజానికి కేసీఆర్ ప్రసంగంలో వినిపించిన బేలతనం చాలామందిని విస్మయానికి గురి చేసింది. ఆయన తీరుకు భిన్నంగా ఆయన మాటలు ఉన్నాయంటున్నారు. ''రేపు మోదీ ఏమంటడు.. కేసీఆర్‌ మీటర్లు వద్దన్నవ్‌.. అయినా మునుగోడులో నాకే ఓటు వేసిన్రు.. నువ్వు జరిగిపో అని నన్ను పక్కకు నెట్టి మీటర్లు తెచ్చి పెడ్తడు. రైతులూ తస్మాత్‌ జాగ్రత్త'' అన్న మాటలు కానీ.. ''ఈ డూప్లికేట్‌, అవసరం లేని ఉప ఎన్నిక తెచ్చిన గోల్‌మాల్‌ గాళ్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే.. మన బాయికాడ, మన బోర్ కాడ బీజేపీ మీటరు పెట్టుడు కాదు.. అందరం ఒక్కటై బీజేపీకే మీటరు పెట్టాలి. పీడ పోతది. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ కావాలి. ఇది పార్టీల ఎన్నిక కాదు, కార్మికులు, రైతుల బతుకుదెరువు ఎన్నిక. ప్రజలు ప్రలోభాలకు లోను కావద్దు'' అంటూ మాట్లాడిన మాటల్లో పదును కంటే కూడా ప్రాధేయపడటం కనిపిస్తుందని చెప్పాలి. ఇదంతా కేసీఆర్ స్టైల్ కు పూర్తి భిన్నమని చెప్పక తప్పదు.