Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్రజలు సిద్ధం కండి.. వరాల జల్లులో ఉక్కిరిబిక్కిరి

By:  Tupaki Desk   |   4 Sep 2022 4:27 AM GMT
తెలంగాణ ప్రజలు సిద్ధం కండి.. వరాల జల్లులో ఉక్కిరిబిక్కిరి
X
చేతికి ఎముక అన్నదే లేనట్లుగా వరాల వర్షం కురిపించటం అందరు పాలకులకు చేతకాదు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రూటే సపరేటు. అప్పులు చేస్తున్నామా? అవసరానికి మించిన అనవసరమైన ఖర్చు చేస్తున్నామా? ఉచితాల మత్తులోకి ప్రజల్ని దించుతున్నామా? మొత్తంగా రాష్ట్రానికి అత్యంత అవసరమైన మౌలిక వసతుల కల్పన అంశాన్ని పక్కన పెట్టేశామా? లాంటివి పట్టించుకోకుండా తమ పొలిటికల్ ఎజెండాకు తగ్గట్లుగా పావులు కదిపే విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరే భిన్నంగా ఉంటుందని చెప్పాలి.

మునుగోడు ఉప ఎన్నిక సవాలుతో తెర మీదకు వచ్చి తొడ కొట్టిన కమలనాథులకు.. తానేమిటో చూపించాలన్న కసితో ఉన్నారు కేసీఆర్. అందుకే.. గడిచిన కొంతకాలంగా పట్టని పాలనా వ్యవహారాలతో పాటు.. వరాల వర్షాన్ని మళ్లీ కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా నిర్వహించిన సమావేశంలో ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇవ్వనున్న వరాల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందన్న విషయం జనాల మనసుల్లో రిజిస్టర్ అయ్యేలా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలోని లబ్థిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లాలన్న ఆర్డర్ వేసేశారు.

దళిత బంధు.. కొత్తగా ఇచ్చే 10 లక్షల ఫించన్లను ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యేలు పంపిణీ చేయాలని చెప్పారు. పింఛన్లను అధికారులతో ఇప్పించటం కాదు.. మీరే ఇంటింటికి వెళితే దాని ఎఫెక్టు వేరుగా ఉంటుందని స్పష్టం చేయటం గమనార్హం. అంతేకాదు.. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు.. మరిన్ని అవసరమైనా ఇచ్చేద్దామన్న కేసీఆర్.. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో ఉండాలని.. కార్యకర్తలతో కలిసి ఉండాలన్నారు.

అంతేకాదు.. వన భోజనాలు లాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ అందరినీ కలుస్తుండాలన్న ఆయన.. రానున్న రోజుల్లో దేశంలోని మరే రాష్ట్రంలోనూ అమలు చేయని రీతిలో దళితబంధును ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇదంతా చూస్తే.. మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. కేసీఆర్ మెదడు మరింత షార్ప్ కావటమే కాదు.. మరికొన్ని వరాల్ని టైమ్లీగా ప్రకటించి మనసు దోచుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తున్నాయి.