Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు వామపక్షమా? ఆ ఘటనతోనే ఇంతలా దగ్గర?

By:  Tupaki Desk   |   4 Sep 2022 3:30 PM GMT
కేసీఆర్ కు వామపక్షమా? ఆ ఘటనతోనే ఇంతలా దగ్గర?
X
తెలంగాణలో ప్రస్తుతం వామపక్షాల అవసరం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అర్జంటుగా లెఫ్ట్ పార్టీల ఉనికి గుర్తొచ్చింది. దీంతోపాటు జాతీయ రాజకీయాల ప్రయాణం రీత్యా సీఎం కేసీఆర్ కు సీపీఐ, సీపీఐం ముఖ్యమైనవిగా మారిపోయాయి. పైకి చూస్తే జాతీయ రాజకీయాల కోణం కనిపిస్తున్నప్పటికీ.. అంతరార్థం మాత్రం మునుగోడు ఉప ఎన్నిక అని అందరికీ తెలిసిపోతుంది.

ఇంకా లోతుగా చూస్తే.. ఓ వామపక్షం మునుగోడును చూసుకుని తన పని చక్కబెట్టుకుందని తెలుస్తోంది. ఇటీవల జాతీయ పండుగ రోజున జరిగిన ఆ దారుణ ఉదంతం అందరినీ కలచి వేసింది. ప్రపంచం అత్యంత వేగంగా దూసుకెళ్తున్న ఈ రోజుల్లోనూ ఇలా పగలు, పంతాలకు పోతారా? అనే సందేహం వ్యక్తమైంది. అయితే, ఈ ఘటనకు ఓ పార్టీ ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుని.. మునుగోడు ఉప ఎన్నికను ఆసరాగా చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ యంత్రాంగం చేసిన దారుణాన్ని చూసీ చూడనట్లు వదిలేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్
చేసే స్థాయికి వెళ్లడం వెనుక మునుగోడులో ఆ పార్టీ బలంగా ఉండడమే కారణమని సమాచారం.

సీఎంతో భేటీ గంటల పాటు సాధారణంగా తమ పార్టీ వారికి తప్ప.. (అదీ అవసరమైన సందర్భంలోనే) ఇతర ప్రత్యర్థి పార్టీల వారికి సమయం ఇవ్వని కేసీఆర్.. ఆ వామపక్ష పార్టీ నేతలకు మాత్రం ఏకంగా గంట సమయం ఇచ్చి మాట్లాడడం గమనార్హం. రాష్ట్రంలోని పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు జరిగినట్లుగా చెబుతున్న ఈ సమావేశంలో జాతీయ రాజకీయాల ప్రస్తావన కూడా వచ్చినట్లు మీడియా వివరించారు. అదే సమయంలో మునుగోడు వరకు తమ మద్దతు కొనసాగుతుందని సీఎంకు ఆ వామపక్ష నేతలు చెప్పడం గమనార్హం. మునుగోడు తర్వాత కూడా కలిసి వెళ్దామని సీఎం కేసీఆర్ కోరినా.. ఆ వామపక్ష నేతలు మాత్రం ప్రస్తుతానికి ఉప ఎన్నిక వరకు పరిమితం అన్నట్లు వివరాలు బయటకు వచ్చాయి. ఇక జాతీయ రాజకీయాల విషయానికి వస్తే.. ప్రధాని మోదీ మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని.. ఆయనను ఎదుర్కొనడంలో వామపక్షాలుగా మీ సాయం కావాలని సీఎం కోరడం.. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటంలో రాజీ లేని వామపక్షాలు అందుకు సిద్ధంగా ఉండడం వేరే విషయం.

కాంగ్రెస్ కాకుండా.. టీఆర్ఎస్సా?

వాస్తవానికి తెలంగాణలో వామపక్షాలు టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పక్షాల నిలవాలి. జాతీయ రాజకీయాల రీత్యా చూసినా.. మోదీని ఎదుర్కొనే క్రమంలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ కే అండగా ఉండాలి. ఇక తెలంగాణలో కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక ముందర.. అది కూడా బీజేపీ తెలంగాణలో అధికారం కైవసానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో.. మునుగోడులో బలమైన అభ్యర్థితో బరిలో దిగుతున్న క్రమంలో.. కాంగ్రెస్ దశాబ్దాల పాటు ప్రాతినిధ్యం వహించి, సిట్టింగ్ స్థానంగా ఉన్నచోట వామపక్షాల మద్దతు హస్తం పార్టీకి ఉండడం అవసరం. కానీ, లెఫ్ట్
పార్టీలు అందుకు భిన్నంగా అధికార టీఆర్ఎస్ కు మద్దతు తెలిపాయి. రాజకీయ పార్టీలుగా వారి ఈ వ్యూహం సరైనదేనా అనే సందేహం వ్యక్తమవుతోంది.

ఆ ఘటనకు మునుగోడుకు లింకు

తెలంగాణలోకి కీలక జిల్లాలో గత నెలలో చోటుచేసుకున్న ఘటనకు.. తాజాగా ఓ వామపక్షం మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతు తెలపడానికి సంబంధం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. తమ పార్టీ ఉనికికి ఎదురవుతున్న ఇబ్బందిని ఆ ఘటన ద్వారా తప్పించిన వామపక్షం.. ప్రతిగా కేసును నీరుగార్చేందుకు ఉప ఎన్నిక మద్దతును ఆసరాగా చేసుకుందని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అందులోభాగంగానే తాము బలంగా ఉన్న మునుగోడులో అధికార పార్టీకి మద్దతు పలికినట్లు చెబుతున్నారు. ఈ కోణంలోనే.. కాంగ్రెస్ స్నేహ హస్తం చాచినప్పటికీ మునుగోడులో ఆ పార్టీని విస్మరించి అధికార టీఆర్ఎస్ వైపు మొగ్గిందని అంటున్నారు.