Begin typing your search above and press return to search.

కేసీఆర్‌దే లేటు.. కేంద్రం అడ్డంగా దొరికిపోయిందిగా!

By:  Tupaki Desk   |   11 Sep 2022 3:26 AM GMT
కేసీఆర్‌దే లేటు.. కేంద్రం అడ్డంగా దొరికిపోయిందిగా!
X
రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు ఛాన్స్ ఇవ్వనే కూడ‌దు. ఇచ్చారా.. ఇక అంతే! ఇప్పుడు కేంద్రంలోని మోడీ స‌ర్కారు గురించే ఈ వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్రం భ‌లే ఛాన్స్ ఇచ్చింద‌ని చెబుతున్నారు. తాజాగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం.. కేసీఆర్‌కు వ‌రంగా ల‌భించింద‌ని అంటున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. త‌మ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని.. కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. అయితే.. దీనిపై కేంద్రం స‌సేమిరా అంది. మీరే కొనుగోలు చేసుకోండి.. మేం ఒక్క గింజా కొనేది లేద‌ని స్ప‌ష్టం చేసింది.

అంతేకాదు.. నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరు నెలల క్రితం గొప్పగా చెప్పుకొంది. అయితే.. ఇంత‌లోనే కేంద్రం.. ఏమ‌నుకుందో ఏమో కానీ.. తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించింది. బాస్మ‌తీయేత‌ర బియ్యం ఎగుమ‌తుల‌పై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఇక‌, నూక‌ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎగుమ‌తి చేసేందుకు వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ ప‌రిణామ‌మే రాజ‌కీయంగా కేంద్రం .. కేసీఆర్ స‌ర్కారుకు ఆయుధాల‌ను అందించిన‌ట్టు అయింద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ధాన్యం కొనుగోలు అంశం ఇంకా చల్లార‌లేదు.

ఇటీవ‌ల కూడా కేసీఆర్ ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. ఇక‌, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక స‌మ‌యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణ‌యంపై ఆయ‌న నిప్పులు చెర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ తీసుకోమంటూ మోడీ సర్కారు కొర్రీలు పెట్టడంతో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు వరి వేయకుండా ఇతర పంటల వైపు మళ్లించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా గత వానకాలం సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గింది.

రాబోయే రోజుల్లో కోటి ఎకరాలు దాటే అవకాశం కూడా ఉంది. దేశ వ్యాప్తంగా 12 నుంచి 15 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉందని.. అందుకే బియ్యం ఎగుమతులను నియంత్రించిన‌ట్టు కేంద్రం చెప్పింది. మ‌రి దేశానికి సమగ్ర ఆహార ధాన్యాల సేకరణ విధానం లేకపోవడం మోడీ ప్రభుత్వ వైఫల్యమేనని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇదిలావుం టే.. ఈ విష‌యంపై ఇప్ప‌టికే మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానించిన పీయూష్ గోయల్‌ ఇప్పుడు నూకల ఎగుమతులను నిషేధించి వాటినే తింటారేమోనని ఎద్దేవా చేశారు.