Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను సక్సెస్ ఫుల్ గా క్రాక్ చేసిన కమలనాథులు

By:  Tupaki Desk   |   18 Sep 2022 11:30 AM GMT
కేసీఆర్ ను సక్సెస్ ఫుల్ గా క్రాక్ చేసిన కమలనాథులు
X
మాటలు సింఫుల్ గా ఉండొచ్చు. కానీ ఆ మాటలు చెప్పే మనుషులు చాలా టఫ్ గా ఉంటారు. అలాంటి తీరు అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిలో ఉంటే ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తారు. నలుగురిని చుట్టూ కూర్చోబెట్టుకొని మాట్లాడే వేళలో కానీ.. సభల్లోకానీ ఆయన చెప్పే మాటలు విన్నప్పుడు.. ఆయన మాటలు చాలా సింఫుల్ గా ఉన్నట్లు కనిపిస్తాయి. విలువలతో కూడిన.. ఆదర్శాలకు నెలవుగా మాటలు ఉంటాయి. మాటలకు పొంతన లేకుండా చేతలు ఉంటాయి.

కేంద్రంలోని మోడీసర్కారు తీరుపై.. విపక్షాలపై వారు వ్యవహరిస్తున్న ధోరణిపై తరచూ ప్రశ్నలు వేసే కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో తన రాజకీయ ప్రత్యర్థులపై వ్యవహరించిన తీరు ఒకేలా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. రాజకీయ ఎత్తుల్లో కేసీఆర్ ను కొట్టే మొనగాడే ఎవరూ ఉండరన్న భావన చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు.. ఆయన మొండితనం గురించి తెలిసిన వారు.. ఆయన్ను వంచటం అంత తేలికైన విషయం కాదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ఎంతటి వారికైనా చెక్ చెప్పేటోడు ఒకడు ఉంటాడన్న మాటకు తగ్గట్లే.. రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపే కేసీఆర్ కు సైతం సినిమా చూపించేటోళ్లు ఉంటారన్న విషయం తాజాగా కమలనాథుల్ని చూస్తే అర్థమవుతుంది. ఆయనకు చెక్ చెప్పే అంశం అంత తేలిక కాదని.. ఆయన ప్రోగ్రాంను క్రాక్ చేయటం సులువు కాదనే దానికి భిన్నంగా.. గులాబీ నేతను విజయవంతంగా క్రాక్ చేసిన ఘనత బీజేపీదేనని చెప్పక తప్పదు.

తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా అవతరించి ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఈ ఏడాది మినహాయించి మిగిలిన ఏడేళ్లలో ఏ ఒక్కసారి కూడా సెప్టెంబరు 17న నిర్వహించాల్సిన తెలంగాణ విమోచన/విలీన దినాన్ని ఇంత భారీగా నిర్వహించింది లేదు. ఇదంతా సాధ్యమైందంటే.. అది బీజేపీ పుణ్యమేనని చెప్పాలి. సెప్టెంబరు 17ను ఉపయోగించుకోవటం ద్వారా.. భావోద్వేగాల్ని తట్టి లేపాలన్న బీజేపీ ప్రయత్నం.. సీఎం కేసీఆర్ ను కదిలించటమే కాదు.. ఆయన ప్రోగ్రాంను విజయవంతంగా క్రాక్ చేయటంలో కమలనాథులు సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.

సెప్టెంబరు 17కు ఇంత బజ్ రావటమే కాదు.. బీజేపీ నేతలకు పోటీగా.. వారి కంటే జోరుగా సెప్టెంబరు 17 వేడుకల్ని నిర్వహించటం ద్వారా.. విమోచన/విలీన వేడుకల చాంఫియన్ గా నిలవటానికి చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదని చెప్పాలి. అయితే.. బీజేపీకి మించి తాము ప్రోగ్రాంలు చేయటమే కాదు.. వేడుకల్ని నిర్వహించే విషయంలో తమకు సాటి మారెవరూ లేరని గులాబీ నేతలు గొప్పలు కొట్టుకుంటుంటే.. కమలనాథులు వారిని చూసి నవ్వుతున్న పరిస్థితి. ఎందుకంటే.. ఇవాల్టి రోజున సెప్టెంబర్ 17 కార్యక్రమాల్ని ఇంత భారీగా కేసీఆర్ సర్కారు నిర్వహించిందంటే.. దానికి కారణం బీజేపీ అన్న విషయం రాష్ట్రంలోని అందరికి తెలిసినప్పుడు.. విజయం ఎవరిది అవుతుంది? ఏమైనా.. మొండిఘటం కేసీఆర్ ను సక్సెస్ ఫుల్ గా క్రాక్ చేసిన క్రెడిట్ కమలనాథుల ఖాతలో పడినట్లుగా చెబుతున్నారు.