Begin typing your search above and press return to search.

‘ముందస్తు’పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 Oct 2021 5:33 AM GMT
‘ముందస్తు’పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
X
ఓవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక హడావుడి. మరోవైపు.. ప్లీనరీ నిర్వహణ.. ఇలా ఒకటి తర్వాత ఒకటి చొప్పున కార్యక్రమాల జోరు సాగుతున్న వేళ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ మీద ఫోకస్ పెట్టటం ఒక ఎత్తు అయితే.. అందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ‘ముందస్తు’ ఎన్నికల గురించి కీలక వ్యాఖ్య చేయటం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో దాదాపు తొమ్మిది నెలల ముందే ఎన్నికలకు వెళ్లిన వైనం తెలిసిందే. తాజాగా మాత్రం.. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ఇంతకూ కేసీఆర్ నోటి నుంచి ముందస్తు మాట ఎందుకు వచ్చింది? అన్నది ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేస్తున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇప్పటివరకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ స్పందించింది లేదు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు వీలుగా తాజాగా ఆయన పాల్గొన్న పార్టీ వేదిక మీదనే స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఈ సారి ముందస్తు ఎన్నికలు ఉండవని.. ముందస్తుకు వెళ్లాలని తాము అనుకోవటం లేదని తేల్చేశారు. ఎన్నికలకు రెండున్నరేళ్లు సమయం ఉన్నందున.. ఈ లోపు అన్ని పనులూ పూర్తి చేసుకోవాలన్న ఆలోచనను ఆయన చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకునేలా కష్టపడి పని చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేసిన ఆయన.. గత ఎన్నికలకు ముందు అసెంబ్లీ.. లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే తమకు కలిగే నష్టాన్ని తాను ముందే అంచనా వేశానని.. అందుకే ముందస్తుకు వెళ్లినట్లుగా ఆయన చెప్పారు. ఈసారి అలాంటి అవసరం లేదన్న ఆయన.. ముందస్తుకు వెళ్లటం లేదని తేల్చేశారు.మరి.. ఇదే మాట మీద కేసీఆర్ ఉంటారా? మాట మారుస్తారా? అన్నది కాలమే చెప్పగలదు.