Begin typing your search above and press return to search.

‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు రాజకీయ మద్దతు

By:  Tupaki Desk   |   6 Oct 2021 2:34 PM GMT
‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు రాజకీయ మద్దతు
X
'మా' ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఓ వైపు మంచు విష్ణు.. మరోవైపు ప్రకాష్ రాజ్ లు మాటల మంటలు రేపుతూ విమర్శలు ప్రతివిమర్శలతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి ప్రకాష్ రాజ్ కు మద్దతు దక్కుతుండగా.. నందమూరి , కృష్ణ ఫ్యామిలీలు మంచు విష్ణు వెంట నడుస్తున్నాయి. ఇక సినీ కళాకారులంతా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. మంచు విష్ణుకు స్వయాన బావ అయిన జగన్ ఏపీ సీఎంగా ఉండడంతో ఇది రాజకీయ కోణంగా మారింది.

ఈ క్రమంలోనే తాజాగా ప్రకాష్ రాజ్ కు తెలంగాణ కాంగ్రెస్ నుంచి అనూహ్య మద్దతు లభించింది. ప్రకాష్ కు కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ మద్దతు ప్రకటించాడు. సినిమా గ్రూపులకు అతీతంగా అందరూ ఒక్కమాటపై ప్రకాష్ రాజ్ ను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సమస్యలపైనా, సమాజంపైనా అవగాహన ఉన్న వ్యక్తికి ఓటువేస్తేనే అందరికీ మేలు జరుగుతందని అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరం నటుల్లో ప్రత్యేకతను చాటుకున్న ప్రకాష్ రాజ్ 'మా' అధ్యక్ష బరిలో నిలవడం సంతోషకరమన్నారు.

ప్రకాష్ రాజ్ ను గెలిపించడం అంటే ఒక ప్రజాస్వామ్యవాదిని గెలిపించినట్టుగా అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. 'ప్రకాష్ ను 'మా' అధ్యక్షుడిగా ఎన్నుకుంటే దక్షిణ భారతదేశంలోనే ఒక విలువైన నాయకుడిగా గుర్తింపు పొందుతారన్నారు.

ఈ మా ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సినీ ప్రముఖులకు అద్దంకి పిలుపునిచ్చాడు. ప్రకాష్ రాజ్ ను గెలిపించడం ద్వారా సినీ పరిశ్రమ ప్రజాస్వామ్యబద్దంగా ఉందని నిరూపించాలని సినీ పెద్దలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇప్పటివరకు మా ఎన్నికలపై ఏ రాజకీయ పార్టీ అధికారికంగా స్పందించలేదు. మొదటి సారి తెలంగాణ కాంగ్రెస్ నుంచి ప్రకాష్ కు మద్దతు దొరకడం విశేషమని చెప్పొచ్చు.