Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షం మ‌ళ్లీ కామెడీ పాల‌వుతోంది

By:  Tupaki Desk   |   3 Sep 2016 9:14 AM GMT
ప్ర‌తిప‌క్షం మ‌ళ్లీ కామెడీ పాల‌వుతోంది
X
దావూద్ ఇబ్రహీంలా డాన్ అవతారం ఎత్తాలనుకుని పోలీసుల చేతిలో హతమైన నరుూముద్దీన్‌ తో ప్రముఖులకు ఉన్న లింకులపై విచారణ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం కనిపించడం లేదు. ఈ విషయంలో శాసనసభాపక్ష నేత ఒకదారిలో వెళుతుంటే శాసనమండలి నేత - ఇతర ప్రముఖులు అందుకు భిన్నమైన వాదన వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. నయీముద్దీన్ ఎన్‌ కౌంటర్, ఆ తర్వాత అతనితో పోలీసు - రాజకీయ నాయకులకు ఉన్న సంబంధాలపై మీడియాలో పుంఖానుపుంఖాల కథనాలు వెలువడుతున్నాయి. అధికార తెరాస ప్రముఖులతోపాటు, ప్రస్తుతం ఉన్నత హోదాలో ఉన్న పోలీసు అధికారులతోనూ నయీమ్ చెట్టపట్టాల్ వేసుకుని తిరిగారని, వారితో మాట్లాడిన ప్రతిసారీ ఫోన్ సంభాషణలను రికార్డు చేశారన్న కథనాలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని వ్యవహారాలపై సిట్ ఏర్పాటుచేసింది. అయితే, సిట్ దర్యాప్తు వల్ల న్యాయం జరగకపోగా, వాస్తవాలు సమాధి అవుతాయన్న వాదన వినిపిస్తోంది. అందుకే సిబిఐ విచారణ జరిపించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం విభిన్న డిమాండ్లు వినిపిస్తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. నయీంకు సంబంధించి జరుగుతున్న సిట్ విచారణ సరిపోతుందని సీఎల్‌ పి నేత జానారెడ్డి స్పష్టం చేశారు. సిట్‌ తో అన్ని విషయాలు వెలుగుచూస్తాయన్న నమ్మకం ఉందని, అందులో వాస్తవాలు బయటకపోతే అప్పుడు సీబీఐ గురించి ఆలోచించవచ్చని వ్యాఖ్యానించారు. కానీ విధానమండలిలో కాంగ్రెస్ నేత - షబ్బీర్ అలీ - కోమటిరెడ్డి - వీహెచ్ తదితర అగ్రనేతలంతా సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. నయీం వద్ద దొరికినట్లు చెబుతున్న 2కోట్ల కంటే ఇంకా ఎక్కువ డబ్బు దొరికినట్లు తన వద్ద సమాచారం ఉందని షబ్బీర్ వెల్లడించారు. సోహ్రాబుద్దీన్ కేసుకు - నయీముద్దీన్ ఎన్‌ కౌంటర్‌ కు సంబంధం ఉందనిపిస్తోందని, పైగా ప్రధాని వచ్చి వెళ్లిన మరుసటిరోజే ఎన్‌ కౌంటర్ జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇవన్నీ వెలుగు చూడాలంటే సీబీఐ విచారణే సరైనది వాదించారు. పైగా ఈ కేసులో తెరాస నేతలే ఎక్కువగా ఉన్నందున, సిట్‌ తో నిష్పక్షపాత విచారణ సాధ్యం కానందున, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

అటు జానారెడ్డి సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా జానారెడ్డి వ్యాఖ్యలతో విభేదించి, సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో న‌యీం తనను బెదిరించాడన్నారు. నయీంతో 95 శాతం తెరాస ప్రముఖులకు సన్నిహిత సంబంధాలున్నందున, సిట్‌ తో నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాజ్యసభ మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా నయీం వ్యవహారంపై విచారణకు సిట్ సరిపోదని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే, నల్లగొండ జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఎలాంటి డిమాండ్ వినిపించకుండా మౌనంగా ఉండటం గమనార్హం. మొత్తంగా స‌ర్కారును ఇరుకున పెట్టాల్సిన ప్ర‌తిప‌క్షం స్ప‌ష్టత లేక‌పోవ‌డంతో తానే ఇర‌కున ప‌డుతోందనే రాజ‌కీయ వ‌ర్గాలు బ‌హిరంగంగా చ‌ర్చించుకుంటున్నాయి.