Begin typing your search above and press return to search.

జానా ప‌ద‌వికి గండం..ఎమ్మెల్యేల భేటీ!

By:  Tupaki Desk   |   20 Feb 2017 5:02 AM GMT
జానా ప‌ద‌వికి గండం..ఎమ్మెల్యేల భేటీ!
X
తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం నేడు అత్యవసర భేటీ కానుంది. సమావేశంలో కొత్త సీఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశముందని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ప్ర‌స్తుతం శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా సీనియ‌ర్ నేత జానారెడ్డి ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న ప‌నితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ వ‌ర్గాలు ఈ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లి శాసనసభా సమావేశాల్లో అధికార పార్టీని ప్రతిపక్షం ఎదుర్కోలేక పోతుందన్న విమర్శలు వెల్లువెత్తాయియి. అసెంబ్లీ సమావేశాల్లో తమ సత్తా చూపిస్తామని చెప్పిన సీఎల్పీ...ఆ పాత్ర పోషించడంలో విఫలమైందన్న ప్రచారం జరిగింది. మొదటి, రెండు రోజుల్లో దూకుడుగా వ్యవహరించినట్టు కనిపించినా కాల క్రమేణా ఉత్సాహం తగ్గిపోయింది. ఇప్పటికే అనేక ప్రజాసమస్యలు ఉన్నప్పటికి వాటిని పక్కన పెట్టి అధికార పార్టీ ఎజెండాను అమలు చేస్తోందని ప‌లువురు పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రెండున్నరేళ్ల‌లో రెండుగదుల ఇండ్లు ఒకటి - రెండు చోట్ల మినహా ఎక్కడా నిర్మించలేదు. ఇందిరమ్మ బిల్లు చెల్లించలేదని, నయీమ్‌ ఎన్‌ కౌంటర్‌ - ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ - ఫీజు రీయింబ‌ర్స్‌ మెంట్ త‌దిత‌ర అంశాల్లో ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేయాల్సి ఉండ‌గా జానారెడ్డి చూసి చూడ‌న‌ట్లు ఉన్నార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అసంతృప్తితో ఉన్నాయి.

అదే స‌మ‌యంలో టీఆర్ ఎస్‌ కు మ‌ద్ద‌తు ఇచ్చే వ్యాఖ్య‌ల‌ను ప‌లు సంద‌ర్భాల్లో జానారెడ్డి చేస్తున్నార‌ని పాల్వాయి గోవర్ద‌న్ రెడ్డి వంటి సీనియ‌ర్లు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా రూ.5 భోజ‌నాన్ని మెచ్చుకోవ‌డం, అనంత‌రం వివిధ ప‌థ‌కాల్లోనూ టీఆర్ ఎస్ స‌ర్కారును ప్ర‌శంసించడం సొంత పార్టీ నేత‌ల‌కే రుచించ‌లేదు. ఈ నేప‌థ్యంలో రాబోయే బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేసే స‌మ‌ర్థుడిని ఎన్నుకునేందుకు ఈ అత్య‌వ‌స‌ర భేటీ ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/