Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నేత‌ల‌కు కొత్త టెన్ష‌న్‌

By:  Tupaki Desk   |   26 Sep 2018 2:20 PM GMT
కాంగ్రెస్ నేత‌ల‌కు కొత్త టెన్ష‌న్‌
X
తెలంగాణ‌లో ముంద‌స్తు పోరు అప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న టీఆర్ ఎస్ పార్టీకి - మ‌హాకూట‌మిలో పెద్ద‌న్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మ‌ధ్యేన‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన విష‌య‌మేం కాదు. ఎన్నిక‌ల‌కు తొడ‌గొట్టి స‌వాల్ విసిరిన టీఆర్ ఎస్ పార్టీ త‌న శ‌క్తియుక్తుల‌తో ప్ర‌చార‌ప‌ర్వాన్ని వేగంగా ముందుకు తీసుకుపోతుంటే...కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రారంభ ద‌శ‌లోనే ఉంద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేషకుల‌ అభిప్రాయం. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఇంకా పూర్తికాక‌పోవ‌డం - సీనియ‌ర్ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డం - చేరిక‌ల‌తో త‌మ సీటుకు ఎక్క‌డ ఎస‌రు వ‌స్తుందోన‌నే భ‌యం...ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కాంగ్రెస్ నేత‌లు త‌మ ముంద‌స్తు పోరుపై దూకుడుగా ముందుకు సాగ‌లేక‌పోతున్నారు. అయితే, ఈ టెన్ష‌న్ జాబితాలోకి మ‌రో అంశం వ‌చ్చి చేరింది. అదే ఎంపీలుగా బ‌రిలోకి దిగిన వారు, దిగాల్సిన వారు ఎమ్మెల్యే స్థానాల‌పై మ‌క్కువ పెంచుకోవ‌డం.

ఔను. కాంగ్రెస్ నేత‌ల‌కు ఇప్పుడు ఎంపీ స్థాయి రేంజ్ ఉన్న నాయ‌కుల‌తో పెద్ద చిక్కు వచ్చిప‌డింద‌ని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే...ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీలు అసెంబ్లీకి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కాబ‌ట్టి. ఎంపీలుగా ఢిల్లీలో ప‌ని చేసిన జ‌మానాలో అధిష్టానం ద‌గ్గ‌ర ప‌రిచ‌యం ఉండటంతో త‌మ‌కు అసెంబ్లీ సీటు గ్యారంటీ అన్న ధీమా వారిలో వ్యక్తమవుతోందంటున్నారు. ఈ జాబితాలో ప‌లువురు ప్ర‌ముఖులు ఉండ‌టం యువ‌నేత‌ల‌కు మింగుడుప‌డ‌టం లేదు. భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్ప‌టికీ, ఇంకా మూడేళ్ల‌ పదవి కాలం ఉన్న‌ప్ప‌టికీ ఆయన మునుగోడు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. రెండు దఫాలుగా కరీంనగర్ ఎంపీగా ప‌నిచేసిన‌ పొన్నం ప్రభాకర్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉంద‌ని సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలిసింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా ఖమ్మం - పాలేరు స్థానాల్లో ఏదో ఒకటి కావాలని అడుగుతున్నట్టు సమాచారం. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ మహబూబాబాద్‌ సీటుపై కన్నేశార‌ట‌ - అక్క‌డ కాక‌పోతే డోర్నకల్ నుంచి బ‌రిలోకి దిగాల‌ని చూస్తున్నార‌ట‌. మల్కాజిగిరి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కూడా కంటోన్ మెంట్‌ అసెంబ్లీ నియో జకవర్గాన్ని ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీ చేస్తానంటూ చెప్పిన‌ అంజన్‌ కుమార్‌ కూడా తన వ్యూహాన్ని మార్చుకొని సికింద్రాబాద్‌ - ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఆయన అడుగుతున్నట్టు తెలిసింది.

కాగా, కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు ఎమ్మెల్యేగిరీపై మ‌క్కువ క‌లిగేందుకు మ‌రిన్ని కార‌ణాలు ఉన్నాయంటున్నారు. కేసీఆర్‌ ను ఓడ‌గొట్టాల‌ని వ్యూహాలు ప‌న్నుతున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసెంబ్లీకి బలమైన నేతలను దించాలని నిర్ణయించడంతో మాజీ ఎంపీలంతా తమ వ్యూహాన్ని మార్చుకున్నారని అంటున్నారు. దీంతోపాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం పెరగటంతో సీనియార్టీ ప్రకారం రాష్ట్ర మంత్రులుగా అవకాశం రావొచ్చనే ఆశలు ఎలాగూ ఉన్న నేప‌థ్యంలో...ఇలా కొత్త స్కెచ్‌ తో పాత ఎంపీలు ఎంట్రీ ఇస్తున్నార‌ని చెప్పుకొస్తున్నారు. అయితే, స‌ద‌రు నాయ‌కులు క‌న్నేసిన సీట్లలోని అభ్య‌ర్థులు మాత్రం ఈ నాయ‌కులు ఎంట్రీ ఇస్తే త‌మ సంగ‌తి ఏంట‌ని వాపోతుండ‌టం గ‌మ‌నార్హం.