Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఆర్డ‌ర్‌ తో రేవంత్‌ పై అంతా గ‌ప్‌ చుప్‌

By:  Tupaki Desk   |   21 Oct 2017 4:03 AM GMT
ఢిల్లీ ఆర్డ‌ర్‌ తో రేవంత్‌ పై అంతా గ‌ప్‌ చుప్‌
X
తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఎపిసోడ్‌ లో కొత్త ట్విస్ట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రేవంత్ రెడ్డి స‌ర్వం సిద్ధం చేసుకున్న నేప‌థ్యం తెలుగుదేశం పార్టీని షాక్‌ కు గురిచేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా...కాంగ్రెస్ నేత‌లు సైతం అదే రీతిలో ఆశ్చ‌ర్య‌పోయారు. ఎన్నో సార్లు తాము ప్రయత్నించినా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అపాయింట్‌ మెంట్‌ దొరకలేదు...ఉహించని విధంగా రేవంత్‌ కు ఎలా అపాయింట్‌ మెంట్‌ ఇచ్చారని ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్‌ లో రేవంత్‌ చేరికపై అధిష్టానం దూతలే దగ్గరుండి కథనం నడిపించారని కొంద‌రు నేత‌ల‌కు ఆల‌స్యంగా తెలిసిన‌ట్లు స‌మాచారం. హైదరాబాద్‌ నుంచి బయలుదేరి తన నియోజకవర్గం కొల్లాపూర్‌ మీదుగా బెంగళూరు వెళ్లి ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లడానికి అధిష్టానం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్లాన్‌ పూర్తయ్యాకే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. అయితే ఢిల్లీ నుంచే రేవంత్‌ కు లైన్ క్లియ‌ర్ అయిపోయిన నేప‌థ్యంలో..అతిగా స్పందించ‌వ‌ద్ద‌ని కొంద‌రు భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

అనూహ్య‌రీతిలో ఢిల్లీలో రాహుల్‌ ను రేవంత్ రెడ్డి కలిసి వచ్చిన విషయం తెలియగానే...కొంత మంది రేవంత్‌ రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. వారిని అధిష్టానం కంట్రోల్‌ చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జీ రామచంద్రకుంతియా సీనియర్లతో మాట్లాడారు. సీనియర్‌ నేత డీకే అరుణ - ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ - కోమటిరెడ్డి బ్రదర్స్‌ కూడా రేవంత్‌ రెడ్డి రాకను ఆహ్వానిస్తున్నా...లోలోపల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై డీకే అరుణతో కుంతియా మాట్లాడినట్టు సమాచారం. పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కలిసి పని చేయాలని, పార్టీలో ఎవరికి ఉండే గౌరవం వారికి ఉంటుందని జాగ్రత్తలు చెప్పినట్టు తెలిసింది. కుంతియా సూచనలతోనే అరుణతో రేవంత్‌ భేటీ అయ్యారని తెలుస్తోంది. కోమటిరెడ్డితోనూ కుంతియా సంప్రదింపులు జరిపినట్టు స‌మాచారం. ఇప్పటికే రేవంత్‌ రెడ్డి చేరిక ద్వారా చేకూరే ప్రయోజనంపై రాహుల్‌ కార్యాలయం గత రెండు - మూడు నెలలుగా కసరత్తు చేసింద‌ని...రేవంత్ ఎంట్రీ విష‌యంలో ఢిల్లీ పెద్ద‌ల ఆర్డ‌ర్‌ ను పాటించాల్సిందేన‌ని కుంతియా సదరు నేతలకు చెప్పడంతో వారంతా సైలెంట్ అయిపోయిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు రేవంత్ కాంగ్రెస్‌ లో చేరే తేదీపై స్ప‌ష్టత వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. డిసెంబర్ 9న కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ జన్మదినం అనే సంగ‌తి తెలిసిందే. అదే రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలి ప్రకటన వెలువడింది కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ లో రేవంత్‌ రెడ్డి చేరికకు ముహుర్తం ఖరారు చేస్తున్నట్టు గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి. ఈ వారాంతంలో దీనిపై స్ప‌ష్ట‌త రావ‌చ్చున‌ని అంటున్నారు.