Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో కొత్త‌ పంచాయ‌తీని తీర్చేదెవ‌రు?

By:  Tupaki Desk   |   24 Dec 2018 6:37 AM GMT
కాంగ్రెస్‌ లో కొత్త‌ పంచాయ‌తీని తీర్చేదెవ‌రు?
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం కొన‌సాగుతోంది ఓ వైపు ఓట‌మి భారంతో ఆ పార్టీ నేత‌ల్లో ఉండ‌గా మ‌రోవైపు ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు ప‌ద‌వుల కోసం ఆరాట‌ప‌డుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత ఎవరనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ అంశంపై ఇప్పుడు చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. అదే స‌మ‌యంలో ప‌లువురు నేత‌ల ప్ర‌క‌ట‌న‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

తనకు సీఎల్పీ నేతగా అవకాశమిస్తే పార్టీకి న్యాయం చేస్తానంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించటం గమనార్హం. ఇప్పటికే ఆ పదవి కోసం ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క - కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి - సబితా ఇంద్రారెడ్డి - దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఈపదవిపై బహిరంగంగా ఎవ రూ నోరు విప్పకపోయినా...అందరూ తమ తమ స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సీఎల్పీ లేదా టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక పదవి ఇవ్వాలంటూ ఆయన కోరుతున్నట్టు సమాచారం. లేకపోతే పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే, అసెంబ్లీ స‌మావేశం తేదీల గురించి స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డం - ఎమ్మెల్యేల స‌మావేశం గురించి క్లారిటీ లేక‌పోవ‌డంతో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత ఎంపిక గురించి జాప్యం జ‌రుగుతోంద‌ని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం ఇదే విష‌యం గ‌మ‌నించి జాప్యం చేస్తున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, జాప్యం జ‌రిగిన‌ప్ప‌టికీ నేత‌ల ప్ర‌య‌త్నాలు మాత్రం సాగుతున్నాయ‌ని అంటున్నారు.