Begin typing your search above and press return to search.

ఉత్తమ్ వీరత్వాన్ని కథలు కథలుగా చెబుతున్న కాంగ్రెస్సోళ్లు!

By:  Tupaki Desk   |   10 May 2020 2:30 AM GMT
ఉత్తమ్ వీరత్వాన్ని కథలు కథలుగా చెబుతున్న కాంగ్రెస్సోళ్లు!
X
మిగిలిన పార్టీలన్ని ఒక ఎత్తు. కాంగ్రెస్ పార్టీది మరో ఎత్తు. ఆ పార్టీని ఎవరో దెబ్బ తీయాల్సిన అవసరం లేదు. అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ నేతలే ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతుంటారు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో పార్టీలో క్రమశిక్షణ అన్నదే లేకుండా చేసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పాలి.

ఈ కారణంగానే పార్టీ అంతకంతకూ పలుచన అవుతున్న విషయంపై సీనియర్ నేతలు మొత్తుకున్నప్పటికీ.. ఇంతకాలం పెద్దగా ఫోకస్ పెట్టని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.

తనను తాను ఎప్పటికప్పుడు సైనికుడిగా ఉత్తమ్ చెప్పుకుంటారని.. ఆయనేమైనా ప్రజాసేవ చేశారా? ఫ్రీగా చేశారా? జీతం తీసుకునే పని చేశారుగా? అంటూ వ్యాఖ్యానించారు. సూటిగా కాకున్నా.. పరోక్షంగా తలసాని చేసిన వ్యాఖ్యల్ని జాగ్రత్తగా చూస్తే.. సైనికులది కూడా ఉద్యోగమే అన్న భావన కలిగేలా ఉంది.

ఇలాంటి అవకాశం ఇటీవల కాలంలో రాకపోవటం.. గడిచిన కొద్ది నెలలుగా మాట్లాడేందుకు సరైన టాపిక్ చేతిలో లేని నేపథ్యంలో మౌనంగా ఉన్న టీ కాంగ్రెస్ నేతలకు.. తెలంగాణ అధికారపక్షం మీద విరుచుకుపడేందుకు తాజా విమర్శలు ఛాన్సు ఇచ్చాయి. సీఎం కేసీఆర్.. మంత్రి తలసానిని ఉద్దేశించి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే.. ఉత్తమ్ గొప్పతనాన్ని కీర్తించటం ఈసారి ప్రత్యేకతగా చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఉత్తమ్ వీరత్వాన్ని కొలిచిన తీరు చూస్తే.. కాంగ్రెస్ నేతల తీరులో కాస్త మార్పు వచ్చిందన్న భావన కలుగక మానదు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధ విమానాలకు పైలట్ గా పని చేశారని.. చైనా.. పాక్ బోర్డర్లలో సేవలు అందించారని గుర్తు చేస్తున్నారు. యుద్ధ విమానం గాల్లో పేలిపోతే పారాచ్యూట్ సాయంతో బయటపడ్డారన్నారు. ఆ సమయంలోనే ఉత్తమ్ నడుముకు దెబ్బ తగిలిందని గుర్తు చేస్తున్నారు. నోరుంది కదా అని తలసాని లాంటోళ్లు ఉత్తమ్ లాంటోళ్లను అవమానించేలా మాట్లాడతారా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఎన్నాళ్లాకెన్నాళ్లకు అన్నట్లుగా తమ రథసారధి మీద టీఆర్ ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఇంత ఘాటుగా రియాక్టు కావటాన్ని ప్రస్తావిస్తున్నారు.