Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు జ్ఞానోదయం... ఒంట‌రి పోరుకే మొగ్గు

By:  Tupaki Desk   |   7 Feb 2019 11:53 AM GMT
కాంగ్రెస్‌ కు జ్ఞానోదయం... ఒంట‌రి పోరుకే మొగ్గు
X
తెలంగాణ కాంగ్రెస్‌ కు ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎదురైన ఘోర ప‌రాజ‌యం అనేక ర‌కాలైన జ్ఞానోద‌యాన్ని క‌లిగిస్తోంద‌ని అంటున్నారు. మ‌హాకూట‌మి పేరుతో జ‌ట్టుక‌ట్టి అధికార టీఆర్ ఎస్‌ ను మ‌ట్టి క‌రిపించాల‌ని హ‌స్తం పార్టీ వేసిన స్కెచ్ ఏమాత్రం ఫ‌లితం ఇవ్వ‌ని సంగ‌తి తెలిసిందే. సొంతంగా బ‌రిలోకి దిగిన‌ప్ప‌టి కంటే త‌క్కువ సీట్లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఈ విశ్లేష‌ణ‌ల ప‌ర్వంతో తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాబోయే ఎన్నిక‌లో ఒంట‌రి పోరుకే సిద్ధ‌మ‌య్యారు. ఈ విష‌యాన్ని పార్టీ ముఖ్యుడు వెల్ల‌డించారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా . హైదరాబాద్‌ లో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అనే విషయంపై చర్చించాల్సి ఉందని అన్నారు. తెలంగాణలో ప్రజలనుంచి టీడీపీకి వ్యతిరేకత అధికంగా ఉన్నట్టు ఇటీవల ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారని అన్నారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి మొగ్గు చూపుతుందని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిగా పోటీచేసి ఘోర పరాజయం చవిచూసిన నేప‌థ్యంలో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూటమిగా పోటీచేసే అంశంపై ఆయా పార్టీలతో చర్చించాల్సి ఉందన్నారు. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కొత్త ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసి పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారన్నారు.

కాగా, తెలుగుదేశం పార్టీని వ‌దిలించుకునేందుకే, కాంగ్రెస్ సిద్ధ‌మ‌యింద‌ని రాజ‌కీయ‌విశ్లేష‌కులు అంటున్నారు. అందులో భాగంగానే, తాజాగా కుంతియాతో ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న‌లు చేయిస్తున్నార‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల నాటికి ఈ ప్ర‌క్రియ‌ను కాంగ్రెస్ పూర్తి చేయ‌నుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ త‌న‌దారి తాను చూసుకోవ‌డం టీడీపీకి షాక్ వంటిదేన‌ని అంటున్నారు.