Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న వినిపిస్తోందా?

By:  Tupaki Desk   |   6 Feb 2017 10:32 AM GMT
కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న వినిపిస్తోందా?
X
అంతా ఉద్దండులే. చెప్పాలంటే ముఖ్య‌మంత్రి స్థాయి అభ్య‌ర్థులు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది తమ పార్టీయే అని గొప్పగా చెప్పుకునే అవ‌కాశం ఉన్నా కూడా అధికార టీఆర్ ఎస్ ను ఇర‌కాటంలో పెట్ట‌లేక‌పోతోంద‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు. త‌మ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, లీడర్‌ ను కేడర్- కేడర్‌ ను లీడర్ విమ‌ర్శించ‌వ‌చ్చున‌ని అయితే అది శృతి మించింద‌ని చెప్తున్నారు. కాంగ్రెస్‌లో పదవులు పొందాలంటే లాబీయింగ్ చేయాల్సిందేన‌ని గ్ర‌హించి ఆ ప‌నిలో బిజీ అయిపోయార‌ని అంటున్నారు. ఢిల్లీలో ఓ గాడ్‌ ఫాదర్ ఉండాల్సిందేన‌ని గ్ర‌హించి లాబీయింగ్ చేయాల్సిందే కాబ‌ట్టి ఎవరికి వారే లీడర్ అనుకొని పార్టీని ప‌టిష్టం చేయ‌డం ప‌క్క‌న‌పెట్టేస్తున్నార‌ని వాపోతున్నారు.

ఇలాంటి విధానాలే గ‌తంలో త‌మ పుట్టి ముంచాయ‌ని కాంగ్రెస్ నేత‌లు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, యవత బలిదానాలు - ఉద్యమం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడం వంటి పరిణామాలతో కాంగ్రెస్ దిగొచ్చి ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన‌పుడు కూడా కాంగ్రెస్ నేతల్లో ఐక్యత లేకుండా పోయిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది తమ పార్టీయేనని ఎన్నికల ప్రచారంలో ప్రజలను నమ్మించలేకపోయారని దాంతో అధికారం కాస్త దూర‌మ‌యింద‌ని వాపోతున్నారు. ఇప్పుడు కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో టీఆర్‌ఎస్ దెబ్బకు కాంగ్రెస్ కుదేలవుతోందని చెప్తున్నారు. కేడర్‌ ను - లీడర్‌ ను రక్షించుకోలేని పరిస్థితి ఉందని, ఎమ్మెల్యేలతో పాటు పెద్ద పదవులు అనుభవించిన వారు సైతం అధికార టీఆర్‌ ఎస్‌ లోకి వెళ్లారని గుర్తు చేస్తున్నారు. అక్కడ వారికి ఉన్నత పదవులు లభించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి - టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి- నల్గొండ ఎమ్మెల్యే కోమటి వెంకట్‌రెడ్డి వంటి వారు ఇప్పటి నుంచే సీఎం పదవిపై ఆశ పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తామే సీఎం అభ్యర్థులమవుతామన్న ఆశలో ఎవరికి వారే ఉన్నారని దీంతో కేడర్ టీఆర్‌ ఎస్ వైపు చూస్తోందని విశ్లేషిస్తున్నారు. పార్టీ శ్రేణుల‌ను కాపాడుకునేందుకు వారిలో ఉత్తేజం నింపే ఉద్యమాలేవీ కాంగ్రెస్ నేతలు చేయడం లేదని నికార్సైన కాంగ్రెస్ వాదులు వాపోతున్నారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ఢీలా పడుతోంది.

అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కాంగ్రెస్ తీరుపై పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు. ముందు కాంగ్రెస్ లీడర్లు ఇగోలకు పోకుండా ఒకే గొడుగు కిందికి వచ్చి కేడర్‌ లో ఉత్తేజం నింపాలని, టీఆర్‌ ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఒక కార్యాచరణ తీసుకుని నిరంతర ఉద్యమాలు చేయాలని సూచిస్తున్నారు. అప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ పునర్ వైభవం సాధించగలదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే లీడర్లలో ఐక్యత రాకుంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పక వస్తుందని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు మేల్కొని ఏకమై ఉద్యమిస్తే, కేడర్‌ ను రక్షించుకోవడంతో పాటు అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గాడ్‌ ఫాదర్ల అండతో రాజకీయాలు చేస్తామంటే , కేడర్ దూరమై - ఉన్న పదవులు ఊడగొట్టుకోక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్‌ను బలోపేతం చేసే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలపైనే ఉంది. ఎవరికి వారు సాగుతామంటే 2019లో నాటి అనుభ‌వ‌మే ఎదురుకాక త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/