Begin typing your search above and press return to search.

టీ కాంగ్ డేర్‌!... ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బాయ్ కాట్!

By:  Tupaki Desk   |   11 March 2019 11:01 AM GMT
టీ కాంగ్ డేర్‌!... ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బాయ్ కాట్!
X
దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌డి నెల‌కొన్న నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఓ వైపు త‌మ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్ర‌ధానిగా చేయ‌డ‌మే ల‌క్ష్యమంటూ ఆ పార్టీకి చెందిన అన్ని రాష్ట్రాల శాఖ‌లు స‌మ‌ర స‌న్న‌ద్ధ‌మ‌వుతోంటే... అందివ‌చ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను టీ కాంగ్రెస్ ఏకంగా బ‌హిష్క‌రించేసింది. ఈ నిర్ణ‌యంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా... ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించ‌డం త‌ప్పించి త‌మ ముందు ఏ మార్గం కూడా లేద‌ని ఆ పార్టీ నాయ‌క‌త్వం చెబుతోంది. అయినా కీల‌క సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు టీ కాంగ్రెస్ ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకుంద‌న్న విష‌యానికొస్తే... అస‌లు గెలిచే అవ‌కాశాలే లేనప్పుడు పోటీ చేయ‌డం ఎందుకంటూ టీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు చెబుతున్నారు. ఎమ్మెల్యేల‌ను నయానో - భ‌యానో త‌మ వైపున‌కు తిప్పుకుంటున్న అధికార టీఆర్ ఎస్ తీరుకు నిర‌స‌న‌గా ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తే... క‌నీసం ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం య‌త్నించిన‌ట్టైనా అవుతుంద‌న్న‌ది ఆ నేతల వాద‌న‌గా వినిపిస్తోంది.

ఇటీవ‌లే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఏకంగా 88 సీట్ల‌ను సాధించ‌గా... మ‌హా కూట‌మి పేరిట టీడీపీతో జ‌ట్టు క‌ట్టి రంగంలోకి దిగిన టీ కాంగ్రెస్ 21 సీట్ల‌ను సాధించింది. ఈ 21 సీట్ల‌లో 19 కాంగ్రెస్ వి కాగా... మిగిలిన రెండు టీడీపీకి చిక్కిన సీట్లు. అయితే ఇప్ప‌టికే న‌లుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను టీఆర్ ఎస్ లాగేసింది. టీడీపీ ఖాతాలోని ఓ ఎమ్మెల్యేను కూడా లాగేసింది. ఇప్పుడు తాజాగా స‌బితా ఇంద్రారెడ్డి లాంటి కీల‌క నేత‌లు కూడా టీఆర్ ఎస్ గూటికి చేర‌బోతున్నారు. అంటే ఇప్పుడు మ‌హా కూట‌మి మొత్తంగా క‌లిసి నిల‌బ‌డ్డా... ఆ కూట‌మి బ‌లం 15 మాత్ర‌మే. మ‌రి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును ద‌క్కించుకునేందుకు కావాల్సిన సీట్లు కూడా కాంగ్రెస్ వ‌ద్ద లేవు క‌దా. ఈ నేప‌థ్యంలో పోటీలోనే ఉన్నా ప‌రాజ‌యం ఖాయ‌మే. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటిలో ఓ నాలుగు సీట్లు టీఆర్ ఎస్‌ కు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ద‌క్కేస్తాయి.

మ‌హా కూట‌మి ఎన్నిక‌ల్లో గెలిచిన సీట్ల‌న్నీ చెల్లా చెదురు కాకుంటే ఐదో సీటు ఆ టీ కాంగ్రెస్‌దే. ఈ లెక్క‌ల ఆధారంగానే పార్టీలో సీనియ‌ర్ నేత‌గా కాకుండా రాష్ట్ర పార్టీ శాఖ కోశాధికారిగా ఉన్న గూడూరు నారాయ‌ణ రెడ్డిని బ‌రిలోకి దించేసింది. అయితే అధికార పార్టీ ఆప‌రేష‌న్ ఆకర్ష్‌ కు ఏకంగా ఆరు మంది ఎమ్మెల్యేలు గేటు దూకేయ‌డంతో నారాయ‌ణ రెడ్డికి ఓట‌మి ఖాయ‌మైంది. ఈ నేప‌థ్యంలో వ్యూహాత్మ‌కంగా ఆలోచించిన టీ కాంగ్రెస్ పెద్ద‌లు ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించేందుకు నిర్ణ‌యించారు. త‌మ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేల బ‌లంతో ఎమ్మెల్సీ సీటు గెలిచే అవ‌కాశాలున్నా.. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ టీఆర్ ఎస్ త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను త‌నవైపున‌కు తిప్పుకుంద‌ని - ఈ త‌ర‌హా అధికార పార్టీ దురాగ‌తాల‌కు నిర‌స‌న‌గానే తాము బ‌రి నుంచి త‌ప్పుకుంటున్నామ‌ని టీ కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. ఈ వ్యూహంతో టీఆర్ఎస్ ను నిజంగానే ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.