Begin typing your search above and press return to search.

పొత్తే కాంగ్రెస్ కు శాపమవుతోందా.?

By:  Tupaki Desk   |   12 Sep 2018 6:09 AM GMT
పొత్తే కాంగ్రెస్ కు శాపమవుతోందా.?
X
టీఆర్ ఎస్ జోరు మీదుంది. తెలంగాణ అసెంబ్లీని అలా రద్దు చేసి.. ఇలా 105మంది అభ్యర్థులను ప్రకటించేశారు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్. ఆ తర్వాత అంతే వేగంగా ప్రచార పర్వానికి తెరదీసి తెలంగాణలోని ప్రతిపక్షాలు షాకిచ్చారు. కేసీఆర్ అందుకున్నంత వేగంగా కాకపోయినా కాంగ్రెస్ కూడా అంతే వేగంగా స్పందించింది. మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇక ఈ బుధవారం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో చర్చించి కాంగ్రెస్ తరఫున 80 నుంచి 90మంది అభ్యర్థులను ప్రకటించేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడీ అయిపోయారని తెలిసింది. కానీ బుధవారం ఢిల్లీ టూర్ అర్ధాంతరంగా వాయిదా పడిందట.. దీనికి ప్రధాన కారణం పొత్తే..

అవును.. తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మూడు పార్టీల సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ మహాకూటమి చర్చల్లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ - భట్టి - గూడురు నారాయణ రెడ్డి పాల్గొనగా.. టీడీపీ నుంచి ఎల్. రమణ - పెద్దిరెడ్డి - రేవూరి ప్రకాష్ రెడ్డి - సీపీఐ నుంచి చాడా వెంకటరెడ్డి - కూనంనేని సాంబశివరావులు హాజరయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలంటే భావసారుప్యం ఉన్న పార్టీలు కలిసి పనిచేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. టీఆర్ ఎస్ ను గద్దెదించేందుకు ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని..కలిసి వచ్చే అన్ని పార్టీలు - ప్రజాసంఘాలను కలుపుకు పోవాలని నిర్ణయించారు.

కాంగ్రెస్ ప్రకటించాలనుకున్న 80-90 మంది అభ్యర్థుల జాబితా పొత్తుల తకరారుతో వాయిదా పడింది. కాంగ్రెస్ తో కలుస్తున్న టీడీపీ - సీపీఐ - ఒకవేళ కలిసి సీపీఎం - కోదండరాం టీజేఎస్ లకు సీట్లు కేటాయించిన తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది. ముందుగానే ప్రకటిస్తే కూటమి ఏర్పాటు - సీట్ల పొత్తు డిస్ట్ర్రబ్ అవుతుందని ఉత్తమ్ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ ను పక్కనపెట్టినట్టు తెలిసింది.

పొత్తుల చిత్తుల్లో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు గల్లంతవుతుందో.. ఎక్కడ ఎవరు త్యాగాలు చేస్తారోనన్న టెన్షన్ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోందట.. ఉత్తమ్ కేసీఆర్ ను బలంగా ఎదుర్కోవాలని ఏకంగా 90 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి ముందుకెళ్లాలని నిర్ణయించారు. కానీ ఆ వెంటనే పొత్తులతో ఆ లిస్ట్ కాస్త మరుగున పడింది. ఇప్పుడు మహాకూటమితో ప్రతిపక్షాలకు కాస్త అంతో ఇంత బలం చేకూరబోతుండగా.. బలమైన కాంగ్రెస్ మాత్రం కొన్ని సీట్లు త్యాగం చేసి బలహీన పడడం ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులతో సొంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు అన్యాయం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. వారు రెబల్ గా మారి కాంగ్రెస్ కు నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి. ఇలా కేసీఆర్ ముందస్తుగా ముందుకు పోతుండగా.. పొత్తులతో కాంగ్రెస్ చిత్తవుతోంది. మహాకూటమితో లాభం కంటే కాంగ్రెస్ కు నష్టమేనన్న భావన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది.