Begin typing your search above and press return to search.

రెడ్లను రెడీ చేసుకుంటున్న కాంగ్రెస్!

By:  Tupaki Desk   |   10 Dec 2018 4:05 PM GMT
రెడ్లను రెడీ చేసుకుంటున్న కాంగ్రెస్!
X
రెడ్లను రెడీ చేసుకుంటున్న కాంగ్రెస్ తెలంగాణ ముందస్తు సమరం ముగిసింది. ఇక ఫలితాలే తరువాయి అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎత్తులకు - వ్యూహాలకు పదును పెడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఒక కులానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల్లో... ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న రెడ్డి కులస్తులపై తన కన్నేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీల ఉన్న రెడ్డి అభ్యర్ధులను తనదైన శైలిలో దువ్వేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఆ కులానికి చెందిన పెద్దలు సైతం ఫలితాల బరిలోకి దిగినట్టు చెబుతున్నారు. అయితే ఇలా రెడ్లను ఆకర్షించడంలోనూ ఓ పద్దతిని పాటిస్తున్నట్లు సమాచారం. ముందుగా తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కచ్చితంగా విజయం సాధిస్తారనుకుంటున్న వారికి ఫోన్లు చేస్తున్నారట. అది కూడా తాము నేరుగా చేయకుంగా ఆ రెడ్డి అభ్యర్ధుల దూరపు బంధువుల నుంచి ఫోన్ చేయిస్తున్నట్లు చెబుతున్నారు.

ఒకవేళ ఈ సంప్రదింపులలో దొరికిపోతే బంధువులపై నెపాన్ని నెట్టేసి తాము చేతులు దులుపుకోవాలన్నది కాంగ్రెస్ నాయకుల ఎత్తుగడగా చెబుతున్నారు. రెడ్డి అభ్యర్ధులను కులం సెంటిమెంట్ తో పాటు పలు ఆఫర్లు కూడా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈమధ్యనే కొందరు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయకులను - ప్రజాప్రతినిధులను కులం కార్డు చూపించి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు కూడా ముందుగా కులం కార్డు... ఆ తర్వాత తాయిలాలు ప్రకటించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడగా ఉంది. తమకు కచ్చితమైన మెజార్టీ వచ్చి అధికారాన్ని కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ పైకి ప్రకటించినా లోలోపల మాత్రం ఆ పార్టీని ‍భయం వెంటాడుతోందంటున్నారు. విజయానికి కొంచెం దూరంలో పరుగు నిలిచిపోతుందేమోననే భయంతోనే వారు తెలంగాణ రాష్ట్ర సమితిలోని రెడ్డి కులస్తులు, స్వతంత్రులపై కన్నేసినట్లు చెబుతున్నారు.

ఇక్కడి అభ్యర్ధులకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బంధువులను కూడా వీరితో మాట్లాడించి పని కావివ్వాలనేది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఆలోచనగా చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు హంగు వస్తుందా.... ఎవరికైనా స్పష్టమైన మెజార్టీ వస్తుందా అన్నది కొద్ది గంటల్లో తేలిపోనున్నది. ఈ సందట్లో సడేమియా అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొందరు రెడ్డి అభ్యర్ధులు - నాయకులు తమకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫోన్లు వచ్చాయని చెప్పడం కొసమెరుపు.