Begin typing your search above and press return to search.

ఆ ఓట్ల‌పైనే టీఆర్ ఎస్‌ - కాంగ్రెస్ ఆశ‌లు..!

By:  Tupaki Desk   |   15 Oct 2019 10:29 AM GMT
ఆ ఓట్ల‌పైనే టీఆర్ ఎస్‌ - కాంగ్రెస్ ఆశ‌లు..!
X
హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈసారి ఎలాగైనా విజ‌య ప‌తాకం ఎగుర‌వేయాల‌ని అధికార టీఆర్ ఎస్ స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతుండ‌గా.. వ‌రుస విజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగించాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంది. గ‌త శాస‌న‌స‌భ ఎన్నిక‌ల అనంత‌రం జ‌రిగిన ఎంపీటీసీ - జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించిన టీఆర్ ఎస్ ఇప్పుడు అదే ఒర‌వ‌డి కొన‌సాగుతుంద‌ని ధీమాగా ఉంది. గ‌త శాస‌న‌స‌భ ఫ‌లిత‌మే పున‌రావృతం అవుతుంద‌ని కాంగ్రెస్ గ‌ట్టి విశ్వాసంతో ఉంది. దీంతో కాంగ్రెస్‌ - టీఆర్ ఎస్ మ‌ధ్య నువ్వానేనా అన్న‌ట్లు పోరు కొన‌సాగుతోంది.

గతంలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ అధికార టీఆర్ ఎస్ ఇక్క‌డ ఓటమి పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ప్ర‌ధాన ప్రత్య‌ర్థి అయిన కాంగ్రెస్‌ ను చావు దెబ్బ‌తీసేందుకు త‌గిన వ్యూహాలు ప‌న్నుతున్నారు. ఇది పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ప్రాధినిత్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ గెలుపు కేసీఆర్‌ కు స‌వాల్‌ గా మారింది. ఈక్ర‌మంలోనే పోలింగ్ కు మ‌రో వారం రోజులే గ‌డువు ఉండ‌టంతో ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో అధికంగా ఉన్న గిరిజ‌న ఓట్ల‌ను గంప‌గుత్త‌గా పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈక్ర‌మంలోనే కులాలు - వ‌ర్గాల వారిగా ఓట్లు కొల్ల‌గొట్ట‌డంపై అధికార టీఆర్ ఎస్ ప్ర‌ధానం గా దృష్టి సారించింది. కులాల‌వారీగా ప్ర‌భుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని - అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గంలో అధికంగా ఉన్న గిరిజ‌న ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు అధికార పార్టీ ఆ వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను నియోజ‌క‌వ‌ర్గంలో మోహ‌రించింది.

ఆ వ‌ర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌ - మానుకోట ఎంపీ మాలోత్ క‌విత‌తో పాటు ఎమ్మెల్యేలు శంక‌ర్‌ నాయ‌క్‌ - ర‌వీంద్ర‌నాయ‌క్‌ లు నియోజ‌క‌వ‌ర్గంలో మూడు రోజుల పాటు ప్ర‌చారం నిర్వ‌హించారు. గిరిజ‌న గూడేల‌ను పంచాయ‌తీలుగా ఏర్పాటు చేసి - స్వ‌యంపాల‌న అందించ‌డం - ఆస‌రా - రైతుబంధు - ఉచిత విద్యుత్‌ లాంటి ప‌థ‌కాల గురించి గిరిజ‌న నేత‌లు విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు.

ప్ర‌భుత్వం గిరిజ‌నుల సంక్షేమానికి చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను వారికి వివ‌రిస్తున్నారు. మ‌రోప‌క్క కాంగ్రెస్ కూడా గిరిజ‌న ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డింది. ఇప్ప‌టికే మానుకోట మాజీ ఎంపీ - కేంద్ర మాజీ మంత్రి బ‌ల‌రాం నాయ‌క్‌ తో నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. ఆయ‌న‌తోపాటు గిరిజ‌న నేత‌ల‌ను కూడా ప్ర‌చారంలోకి దింపుతోంది.