Begin typing your search above and press return to search.
సన్నాసులు..దద్దమ్మలని తిట్టలేదని ఫీలవుతున్నారా?
By: Tupaki Desk | 5 Sep 2018 1:30 AM GMTవందల కోట్లు ఖర్చు పెట్టి నభూతో నభవిష్యతి అన్నట్లుగా సభను నిర్వహించాలని తెలంగాణ అధికారపక్షం భావించిన సంగతి తెలిసిందే. అలా సభను నిర్వహించటం ద్వారా వచ్చే సరికొత్త ఊపుతో ముందస్తును ఇరగదీద్దామన్న ఆలోచనలో గులాబీ అధినేతతో సహా.. మొత్తం కారు బ్యాచ్ ఫీలైంది.
ఏదో ఒక సభ అంతగా సక్సెస్ కాకపోతే మాత్రం.. అంతేసి మాటలు అంటారా ఏంటి? అన్న ఫీలింగ్ పెరిగిపోయిన మంత్రి కేటీఆర్ ఒక్కసారి ఒళ్లు విరుచుకొని తన సహజశైలిలో కాంగ్రెస్ నేతలపై దూకుడు మాటల బ్యాటింగ్ షురూ చేశారు. కాంగ్రెస్ నేతలన్నంతనే చెలరేగిపోయి మరీ తిట్టేసే కేటీఆర్.. తన రెగ్యులర్ స్టైల్లో విరుచుకుపడ్డారు.
ప్రగతి నివేదన సభలో కాంగ్రెస్ నేతల్ని దద్దమ్మలు.. సన్నాసులు.. చవటలంటూ తిట్టకపోవటంతో కాంగ్రెస్ నేతలు బాధ పడిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ తో పాటు.. సీనియర్ నేతలు షబ్బీర్ అలీ లాంటోళ్లను తిట్టిపోసి ఉంటే ప్రసంగం బాగుండేదని పొగిడేవారన్నారు. తమను నమ్మి తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టినందుకు ఏం చేశామో.. రాబోయే రోజుల్లో ఏం చేస్తామో చెప్పటానికి మాత్రమే సభా వేదికను సీఎం ఉపయోగించుకున్నారన్నారు.
మళ్లీ అధికారం కానీ కేసీఆర్ కు వస్తే ఏం చేస్తామన్న విషయాన్ని చాలా స్పస్టంగా చెప్పినట్లుగా కవర్ చేసిన కేటీఆర్.. ఉత్తమ్ పై తన రెగ్యులర్ డైలాగ్ ఈసారీ చెప్పేశారు కేటీఆర్. గడ్డం పెంచినంత మాత్రాన ఉత్తమ్ గబ్బర్ సింగ్ కాలేరని.. షబ్బీర్ అలీ కథ ముగిసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ఉత్తమ్.. డీకే..షబ్బీర్.. ఇలా అందరూ సీఎం అభ్యర్థులేనంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి కాంగ్రెస్ నేతల మాటల దాడికి కేటీఆర్ కౌంటర్ ఇవ్వటం ద్వారా.. మిగిలిన గులాబీ దళాల్ని ఎలా విరుచుకుపడాలో శాంపిల్ చూపించారన్నట్లుగా మాటలు ఉన్నాయంటున్నారు.